Ramcharan new movie: 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగాహీరో రామ్‌చరణ్ ఆహార్యం, అభినయం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నటుడిగా ఆయన స్థాయిని మరింత పెంచింది. అయితే ఇప్పుడాయన మరో ఛాలెంజింగ్ రోల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు బడా దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మరో భారీ చారిత్రక చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన 'లెజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్: ది కింగ్ హు సేవ్డ్ ఇండియా నవల ఆధారంగా ఓ మూవీని గతంలో ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. అయితే కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పుడా చిత్రాన్ని పట్టాలెక్కించడానికి అమిష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొదట బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ పేరును పరిశీలించారట. కానీ ఇప్పుడు రామ్‌చరణ్‌ను ఎంపిక చేశారని వార్తలొస్తున్నాయి. హీరోయిజాన్ని ప్రదర్శించడమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడం వల్ల చరణ్ ఈ చారిత్ర చిత్రంలో నటించడానికి అంగీకరించారట.