Ramarao On Duty Movie Pre Release Event: "నేను సాధించాను.. మీరెందుకు సాధించలేరు' అని ధైర్యాన్నిచ్చే వాడు ప్రతి జనరేషన్‌కీ ఒకడుంటాడు. కెరీర్ తొలినాళ్లలో మాకలాంటి ధైర్యాన్నిచ్చిన వ్యక్తి రవితేజ అన్న" అన్నారు కథానాయకుడు నాని. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్ర విడుదల ముందస్తు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ తెరకెక్కించిన చిత్రమిది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.
Hero Nani Speech: ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. "ఈ వేడుకకు అతిథిగా రాలేదు. రవితేజ అన్న గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని వచ్చా. తనకి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన కెరీర్ మొదలు పెట్టినప్పుడు చిరుని స్ఫూర్తిగా తీసుకున్నారు. మేము కెరీర్ మొదలు పెట్టినప్పుడు మాకలాంటి స్ఫూర్తినిచ్చింది రవి అన్న. తను చిరంజీవి క్యారవ్యాన్‌లోకి వెళ్లిన సీన్ చూశా. త్వరలో నేనూ తన క్యారవాన్‌లోకి అలా అడుగు పెట్టాలనుకుంటున్నా. 'రామారావు ఆన్ డ్యూటీ'పై మొదటి నుంచీ నాకు చాలా పాజిటీవ్ వైబ్ ఉంది. టీజర్లు, ట్రైలర్లు చూశాక నా నమ్మకం మరింత పెరిగింది. ఈ చిత్రంలో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. 20ఏళ్ల నుంచి రవితేజ ఆన్ డ్యూటీ. ఈనెల 29 నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ'' అన్నారు. "మాస్ మహరాజ్‌ను పట్టుకుంటే లైఫ్ సెట్టయిపోద్ది. దానికి నేనొక ఉదాహరణ. 'బలుపు' చిత్రంతో నా జీవితమే మారిపోయింది. జీవితాల్ని సెట్ చేయడమే కాదు.. రీసెట్ చేయగలరాయన. 'మెగా154'లో రవితేజ పాత్ర అభిమానులు విజిల్స్ వేసుకునేలా ఉంటుంది" అన్నారు దర్శకుడు బాబీ.