Ram The Warrior Movie Trailer: 'ఒక చెట్టుపై 40 పావురాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే, ఇంకా ఎన్ని ఉంటాయి. అన్నీ ఎగిరిపోతాయి' అంటున్నారు రామ్. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం 'ది వారియర్' కృతిశెట్టి కథానాయిక. శుక్రవారం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్, నటుడు శివ కార్తికేయన్ తమిళ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆద్యంతం మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి చెప్పిన డిఫరెంట్ డిక్షన్ భలేగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
నాని 'దసరా'..
Nani Dasara Movie Look: బొగ్గు గనుల మధ్య నల్ల రంగు పులుముకుని బయటికొస్తున్న సూర్యుడిని గుర్తు చేస్తున్నాడు నాని. అచ్చమైన మాస్ అవతారంలో ఆయన ఎలా సందడి చేశాడో తెలియాలంటే 'దసరా' విడుదల వరకు ఆగాల్సిందే. నాని కథానాయకుడిగా... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా అందులో పాల్గొంటోంది. గోదావరి ఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే చిత్రమిది.
నాని లుంగీ కట్టి, గెడ్డం పెంచి పక్కా అవతారంలో కనిపించనున్నారు. "పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. నాని తెలంగాణ యాసలో మాట్లాడటంతోపాటు.. పూర్తిస్థాయి యాక్షన్ ప్రధానమైన పాత్రలో కనిపిస్తారు. గత షెడ్యూల్‌లో అన్బరీవ్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని తెరకెక్కించాం. నాని - కీర్తిసురేష్‌తోపాటు, 500 మంది డ్యాన్సర్లపై ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో ఓ పాటని చిత్రీకరించాం. సుదీర్ఘంగా సాగే ప్రస్తుత షెడ్యూల్ కీలకం. చిత్రం తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంద"ని సినీ వర్గాలు తెలిపాయి. సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, కూర్పు: నవీన్ నూలి.