తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రజినీ, చిరు, పవన్​.. ఓ విశ్వక్​సేన్.. వీరందరిలో కామన్ అదే: రామ్​చరణ్ - ఓరి దేవుడా సినిమా

విశ్వక్​సేన్ వ్యక్తిత్వానికి తాను పెద్ద ఫ్యాన్‌ అని నటుడు రామ్​చరణ్ పేర్కొన్నారు. సినిమాలు ఫ్లాప్‌ అయినా హిట్‌ అయినా ఎప్పుడూ సూపర్‌స్టార్‌గానే ఉండాలంటే పర్సనాలిటీనే దోహదం చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌, పవన్‌కల్యాణ్‌, చిరంజీవిని ఉదహరించారు.

RAM CHARAN
RAM CHARAN

By

Published : Oct 16, 2022, 7:11 PM IST

తప్పో ఒప్పో.. విశ్వక్‌సేన్‌ ఇచ్చిన మాట తప్పడని అన్నారు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌. 'ఓరి దేవుడా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన చిత్రమిది. మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ కథానాయికలు. వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. తమిళంలో విజయం అందుకున్న 'ఓ మై కడవులే'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా చిత్ర బృందం ఈవెంట్‌ నిర్వహించింది.

ప్రీరిలీజ్ ఈవెంట్​లో నటీనటులు

వేడుకనుద్దేశించి రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. "మనం (తాను, అభిమానులు, చిరంజీవి) సినిమాను ఎంత ప్రేమిస్తామో, మంచి చిత్రాలను ఎంతగా ఆదరిస్తామో అందరికీ తెలుసు. మీరు ఇక్కడికి వచ్చి, ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. ఎన్నో చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన వంశీ కాక ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా ట్రైలర్‌ చూశా. బాగా నచ్చింది. వెంకటేశ్‌ అన్నా.. మీ కోసమైనా నేను ఈ సినిమా చూస్తా. మిథిలా పాల్కర్‌ ఓటీటీ సూపర్‌ స్టార్‌. ఆమె నటించిన సిరీస్‌లకు నేనూ ఉపాసన అభిమానులం. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్‌సేన్‌ పేరు తెలియని వాళ్లు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్‌తో ఫలక్‌నుమా నుంచి రాజమహేంద్రవరం వరకు, వైజాగ్‌ నుంచి చిత్తూరు వరకు గల్లీగల్లీకి ఆయన ఫ్యాన్స్‌ను సంపాదించాడు"

"ఇచ్చిన మాటపై నిలబడేవారంటే నాకు ఇష్టం. తప్పో ఒప్పో మాటిస్తే విశ్వక్‌ కూడా నిలబడతాడనే పేరుంది. అతని వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌. సినిమాలు ఫ్లాప్‌ అయినా హిట్‌ అయినా ఎప్పుడూ సూపర్‌స్టార్‌గానే ఉండాలంటే పర్సనాలిటీనే దోహదం చేస్తుంది. ఇందుకు రజనీకాంత్‌, పవన్‌కల్యాణ్‌, చిరంజీవిలాంటివారు ఉదాహరణ. పర్సనాలిటీ నిండుగా ఉన్న నటుడు విశ్వక్‌సేన్‌. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే సినిమాకంటే పండగకు ఇంకేం కావాలి. గతంలో.. నేను రాజమహేంద్రవరంలో 'రంగస్థలం' చిత్రీకరణలో ఉండగా 'ఉప్పెన' ఫంక్షన్‌కు వచ్చా. అది రూ.100 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చా. ఇది కూడా అంత పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నా" అని రామ్‌ చరణ్‌ స్పీచ్‌ ముగించారు.

ఓరి దేవుడా పోస్టర్

పేరు గుర్తుపెట్టుకోండి: విశ్వక్‌సేన్‌
"రామ్‌ చరణ్‌ అన్నయ్య సినీ ప్రయాణం నాకెంతో స్ఫూర్తినిస్తుంటుంది. మెగాస్టార్‌ కొడుకుగా పెద్ద బాధ్యతతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటం మామూలు విషయం కాదు. ఇప్పుడాయన భారతీయ చలన చిత్ర పరిశ్రమ అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. నేను డిసిప్లిన్‌ (క్రమశిక్షణ)గా ఉండను. కానీ, ఇప్పుడు అన్నయ్యను దగ్గరగా చూశాను కాబట్టి ఆయన్నుంచి అది నేర్చుకుంటా. అడగ్గానే అన్నయ్య ఈవెంట్‌కు వచ్చారు. ఈ క్షణాల్ని జీవితంలో మర్చిపోను. అశ్వత్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని టాప్‌ దర్శకుల జాబితాలో త్వరలోనే చేరతాడు. సంగీత దర్శకుడు లియాన్‌ జేమ్స్‌, డీఓపీ విద్ధు ఇండియాలోనే టాప్‌ లిస్ట్‌లో నిలుస్తారు. పేర్లు గుర్తు పెట్టుకోండి. ఇదే స్పీచ్‌ మళ్లీ ఐదారేళ్ల తర్వాత చూడొచ్చు. హృదయాన్ని కదిలించే సినిమా ఇది" అని విశ్వక్‌ సేన్‌ తెలిపారు.

"రామ్‌చరణ్‌ సర్‌ ఈవెంట్‌కు రావటం మరిచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమా మీకు మంచి వినోదం పంచుతుంది" అని దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు అన్నారు. "ఓరి దేవుడా సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ చిత్రంతో మీ అందరి ప్రేమ నాకు లభించింది. తప్పకుండా ఈ సినిమా చూసి ఆదరించండి" అని మిథిలా పాల్కర్‌, "ఇది తెలుగులో నా తొలి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి" అని ఆశాభట్‌ ప్రేక్షకులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details