Ram Charan Baby Video : రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు రీసెంట్గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు పెళ్లైన 11ఏళ్లకు వీరికి పాప జన్మించింది. ఇటీవలే ఆ పాపాకు క్లీంకార అని నామకరణం కూడా చేశారు. అయితే నేడు(జులై 20) ఉపాసన పుట్టినరోజు. అలాగే పాప క్లీంకార జన్మించి(జూన్ 20) సరిగ్గా నెలరోజులు అయింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్-ఉపాసన ఓ డాక్యుమెంటరీని తమ సోషల్‌మీడియా ఖాతాలో విడుదల చేశారు.
డెలీవరి కోసం ఉపాసన ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లినప్పటి నుంచి పాప పుట్టి, ఆ తర్వాత చిన్నారికి నామకరణం చేసేవరకు జరిగిన మూమెంట్స్, అలాగే ఆ సయయంలో కుటుంబ సభ్యులు ఎలా భావోద్వేగానికి గురయ్యారు వంటి విషయాలను చూపించారు.
అలాగే ఇందులో 11 ఏళ్ల పాటు పిల్లలు పుట్టబోయే సరికి, ఎదుటి వారు తమను అన్న మాటలను గుర్తుచేసుకుని రామ్‌చరణ్ భావోద్వేగానికి గురవ్వడం గురించి వివరించారు. బిడ్డ పుట్టినప్పుడు ఆస్పత్రిలో కామినేని, కొణిదెల కుటుంబం సంతోషంతో భావోద్వేగం చెందిన క్షణాలను, రామ్‌చరణ్ మొదటి సారి తన బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో వంటివి చూపించారు. ఇంకా ఈ వీడియోలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ అలాగే ఉపాసన తల్లిదండ్రులు శోభనా కామినేని, అనిల్ కామినేని కూడా తమ మనసులోని మాటలను చెప్పారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ.."పదకొండేళ్లయ్యింది. ఏం చేస్తున్నారు ఇద్దరూ.. అన్న ప్రశ్నల వల్ల చాలా ఒత్తిడికి గురయ్యాం. ఏదైనా ఓ సమయం ప్రకారం జరుగుతుందని నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది ఈ బేబీ టైమ్. చాలా సంతోషంగా, ఉద్విగ్నభరితంగా ఉంది. గడిచిన 11 ఏళ్ల దాంపత్య జీవితంలో ఉపాసన.. ఎంతో త్యాగం చేసింది. అంతా సక్రమంగా జరిగింది. పాప ఈ ప్రపంచంలోకి వస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నింటి నుంచి నేను ఉపశమనం పొందబోతున్నానని అనిపించింది. తొమ్మిది నెలల ప్రక్రియను నేను బాగా ఎంజాయ్ చేశాను." అని అన్నారు.
పాపకు క్లీంకార అని పేరు పెట్టడానికి వెనక ఉన్న కారణాన్ని తెలిపారు ఉపాసన. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో ఉండే ద్రవిడియన్ వర్గంలోని చెంచు తెగకు చెందిన ఆదివాసులను స్పూర్తిగా తీసుకుని క్లీంకార పేరును పెట్టినట్లు తెలిపారు. వాళ్ల గొప్ప సంస్కృతి, ఆచారాలు, విలువలును చూసి ప్రభావితం చెందినట్లు వెల్లడించారు. అలాగే చిన్నారి గుర్తింపునకు గాఢమైన ప్రాధాన్యం వచ్చేలా పేరు పెట్టినట్లు చెప్పారు.
"నా పాప చెంచు తెగలో ఓ భాగం అవ్వాలని ఆశిస్తున్నాను. ఆమె పేరు వెనక ఎలాంటి ట్యాగ్స్ ఉండాలని అనుకోవట్లేదు. పేరు, ప్రఖ్యాతలను తనంత తానే సాధించుకోవాలని నేను అనుకుంటాను. అయితే అది ఎటువంటి ఒత్తిడి వల్ల జరగకూడదు. కష్టపడటం వల్ల జరగాలి. పిల్లల పెంపకంలో ఇది ఎంతో ముఖ్యం. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని నేను భావిస్తాను. అలాగే అందరూ కలిసి గడిపిన సంతోషకరమైన క్షణాలకు విలువ ఇవ్వాలని అనుకుంటాను." అని ఉపాసన అన్నారు.