టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ కొంతకాలంగా టాలీవుడ్ చిత్రాలకు దూరమయ్యారు. ‘కొండ పొలం’ తర్వాత ఆమె తెలుగు స్క్రీన్‌పై కనిపించలేదు. దీంతో ఆమె తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదా?అని అభిమానులు చర్చించుకొంటున్నారు. ఇదే విషయంపై తాజాగా రకుల్ స్పందించారు.
"చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను తెలుగు సినిమాల్లో నటించలేదని నాక్కూడా తెలుసు. కానీ, త్వరలోనే తప్పకుండా టాలీవుడ్‌లో నటిస్తా. తెలుగు అభిమానులను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు చిత్ర పరిశ్రమే కారణం" అని రకుల్ వివరించారు.