Rakesh master death : ప్రముఖ వివాదస్పద కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ రీసెంట్గా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. రాకేశ్ మాస్టర్ గొప్పతనాన్ని తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. పరుచూరి పలుకుల్లో భాగంగా ఆయన రాకేశ్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
"రాకేశ్ మాస్టర్‌తో కలిసి నేను ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువు ముక్కురాజు గారితో చాలా సినిమాల్లో కలిసి పనిచేశాను. ఆ తర్వాత ఢీ, జబర్దస్త్ ప్రోగ్రామ్స్‌లో రాకేశ్ మాస్టర్‌ను చూశాను. ఇప్పుడు అకస్మాతుగా ఆయన ఇక లేరంటూ తెలిసి షాక్ అయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి ఓ మాట్లాడుతూ "మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి" అని చెప్పగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాకేశ్ మాస్టర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. 1500 సాంగ్స్‌కు కొరియోగ్రాఫీ చేశారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి ఇద్దరు మంచి కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి అందించారు. వాళ్లంతా ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెడితే అందరికీ బాధేసింది. రాకేశ్ మాస్టర్ తన బాధను.. ఇంకో రూపంలో చూపారు. కానీ ఎవరూ ఆయన్ను దగ్గరకు తీసుకోలేదు. ఆయన జీవితానికి మంచి మార్గాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కొత్త దర్శకులు, కొత్త హీరోలు.. ఎవరో ఒకరు ఆయన్ను మళ్లీ సినిమాల్లోకి తీసుకొని ఉంటే.. ఆయన లైఫ్ ఇంకోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన ఇంటర్వ్యూలను చాలా మంది చూస్తుంటారు. అది నేను గమనించాను. ఆ ఇంటర్వ్యూలు చూస్తే.. ఆయన తన ఆవేదనను వినిపిస్తున్నారని అర్థమవుతుంది. వాటిని చూసిన ప్రతిసారి నేను.. ఆయన ఇంత బాధపడ్డారా అని అనుకున్నాను. ఆయన లైఫ్‌ను ఓ ఎక్సాంపుల్‌గా తీసుకోవాలి. భగవంతుడు మనకు ఓ ఛాన్స్‌ను ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బాధపడుతూ ఉండకూడదు. అది కుదరకపోతే మరో మార్గాన్ని ఎంచుకోవాలి" అని పరుచూరి గోపాలకృష్ణ తన స్పెషల్ వీడియోలో రాకేశ్ మాస్టర్‌కు నివాళులు అర్పించారు.
ఇలా చనిపోయారు..జూన్ 18కి వారం రోజుల ముందు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు రాకేశ్ మాస్టర్. అప్పుడు ఆయన అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 18న ఆయనకు రక్త విరోచనాలు అయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు.. రాకేశ్ మాస్టర్ ప్రాణాలు కాపాడేందుకు చాలా ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. అలా చికిత్స పొందుతూ రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు.