Rajinikanth Muthu Movie Rerelease In Telugu :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల 'జైలర్' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో దాదాపు రూ.600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది 'జైలర్'. ఇలాంటి హిట్ ఇచ్చిన రజనీకాంత్‌కు గట్టి షాక్ తగిలింది. 28 ఏళ్ల క్రితం సూపర్ హిట్‌గా నిలిచిన ఆయన చిత్రం 'ముత్తు' రీ-రిలీజ్ షోలన్నీ తెలుగు రాష్ట్రాల్లో రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ క్లాసిక్ హిట్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. టికెట్లు అమ్ముడుపోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అయితే రీ-రిలీజ్ సినిమాలకు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు అని అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో చాలా వరకు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. కొన్నింటిపై ఆసక్తి చూపించక షోలు రద్దయ్యాయి. ఆ జాబితాలోకే ఇప్పుడు ముత్తు చేరింది.