Rajinikanth madhavan: 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రానికి ప్రముఖ నటుడు రజనీకాంత్ ఫిదా అయ్యారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబి నారాయణన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు మాధవన్‌ను ప్రశంసించారు. అనంతరం ఆయన్ను, నంబి నారాయణన్‌ను రజినీకాంత్ శాలువాతో సత్కరించారు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాధవన్ సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'నంబి నారాయణన్ సమక్షంలో వన్‌మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ (రజినీకాంత్) నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను' అని మాధవన్ పేర్కొన్నారు. ఇద్దరు హీరోలు, శాస్త్రవేత్తను ఒకే ఫ్రేమ్‌లో చూసిన నెటిజన్లు.. కామెంట్ల రూపంలో మాధవన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమా గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మాధవన్ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన తొలి చిత్రమిది. నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవడం, నిరపరాధిగా బయటపడటం తదితర సంఘటలనతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మాధవన్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది.