తన నటనతో, డైలాగ్‌లతో ప్రతి ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే హీరో రాజశేఖర్. ఇండస్ట్రీలో ఆయన, తన భార్య జీవిత రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత.. అనేలా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఈ జంట.. వినోదభరితమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీలో వెన్నెల కిశోర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అలా మొదలైంది' కార్యక్రమానికి వచ్చి తమ లవ్‌స్టోరీని బయటపెట్టారు. వీరి ప్రేమకథ కూడా కాస్త సినిమా స్టైల్లోనే ఉంటుంది. కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వీరి పరిచయం ఓ వింత అనుభవంతో మొదలైంది. అది తెలియాలంటే ప్రస్తుతానికి దానికి సంబంధించి రిలీజై ఆకట్టుకుంటున్న ప్రోమోను చూసేయండి..
ఈ ప్రోమోలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. "ఓసారి రాజశేఖర్ నా దగ్గరకు వచ్చి మీరు నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనిపిస్తోంది అంటూ నన్ను నేరుగా అడిగేశారు. ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్ బాగా నచ్చింది. ఆయన్ను పెళ్లికి ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను" అని పేర్కొన్నారు. ఆ వెంటనే మాట్లాడిన రాజశేఖర్.. "అయితే ఈ విషయం తెలిసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. 'రాజశేఖర్ విలన్‌లా ఉన్నాడు.. నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చారు. అయినా పట్టుదలతో ఉన్న జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసింది. ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నలతో ఓకే చెప్పించింది" అని అన్నారు.