ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది నాటు నాటు పాట. ఆస్కార్ అవార్డును గెలిచేందుకు అడుగు దూరంలో ఉన్న ఆ పాట గురించి గతంలోనే రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆ పాటను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటి వద్దే చిత్రీకరించినట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఆ పాటను ముందుగా భారత్‌లోనే చిత్రీకరించాలని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు. అది వర్షాకాలం కావడం వల్ల భారత్‌లో చిత్రీకరణ సాధ్యపడదనీ ఇతర దేశాల్లో పాటను షూట్ చేయాలనుకున్నట్లు భావించామన్నారు.
నాటు నాటు పాట చిత్రీకరణకు భారత్ వెలుపల చాలా ప్రదేశాలు వెతికామని.. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనం అందుకు సరిగ్గా సరిపోయిందని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. జెలెన్‌స్కీ ఇంటి రంగు, ఎత్తుతోపాటు డ్యాన్స్ చేసేందుకు ఆ గ్రౌండ్ చక్కగా ఉందని రాజమౌళి భావించారు. భద్రతాకారణాల రీత్యా అనుమతి దొరకదనీ.. ఇక ఆ భవనంపై ఆశ వదులుకున్నట్లు తెలిపారు. అయితే అధికారులు మాత్రం "ఇది ఉక్రెయిన్ ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు పాటను సంతోషంగా చిత్రీకరించుకోవచ్చు" అని తెలిపినట్లు రాజమౌళి వానిటీ ఫెయిర్ మాగజిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇప్పటికీ నాటు నాటు పాటను చూసినప్పుడల్లా తనకు కీవ్‌లోని జెలెన్‌స్కీ భవనమే గుర్తొస్తుందని రాజమౌళి చెప్పారు. ఉక్రెయిన్ వల్లే ఇది సాధ్యపడిందని అందుకే వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు రాజమౌళి వెల్లడించారు. కాగా ప్రపంచ చిత్ర పరిశ్రమనే ఉర్రూతలూగించిన ఈ పాట గోల్డెన్‌గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఈ నెల 12న జరిగే ఆస్కార్ వేడుకల్లో ఈ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు లైవ్‌గా ప్రదర్శించనున్నారు.