ప్రపంచవ్యాప్తంగా సినీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఆస్కార్' అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. సినీ తారలు హాజరై సందడి చేశారు. ఇక ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రం ఏకంగా ఏడు అవార్డులను అందుకుని ప్రత్యేకంగా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ అవార్డులు ఆ చిత్రానికే వరించాయి. ఇకపోతే భారత్ నుంచి నామినేట్ అయిన 'ఆర్‌ఆర్‌ఆర్' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వరించింది. అలానే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అవార్డును దక్కించుకుంది.
అయితే ఈ ఆస్కార్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ తెగ సంబరపడిపోయారు. అలాగే ఆస్కార్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన జక్కన్న.. అవార్డు ప్రకటించగానే ఆనందంతో గెంతులేశారు. ఆయనతో పాటు భార్య రమ, కుమారుడు కార్తికేయ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.
ఇక అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత జక్కన్న మాట్లాడుతూ.. "నిజంగా ఇది కలలానే ఉంది. అయితే అవార్డు వస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. మీ జీవితంలో అత్యంత అమూల్య క్షణం మీ చిత్రం అవార్డును సాధించడమా? లేదా ఆస్కార్ వేదికపై మీ చిత్రంలోని పాటను ప్రదర్శించడమా అని అడిగితే, సెలెక్ట్ చేసుకోవడం నిజంగా నాకు కష్టమే. కానీ ఈ రెండింటినీ చూడటం ఎంతో సంతోషంగా ఉంది. పాట ప్రదర్శించినంత సేపు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం.. పూర్తయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చూస్తే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నన్ను నిలబెట్టినట్లు అనిపించింది. అలాగే ఆస్కార్ అవార్డు కీరవాణిని శిఖరాగ్రాన నిలబెట్టింది" అని రాజమౌళి తెగ మురిసిపోయారు.