Rajamouli about Brahmastra : రణ్‌బీర్ కపూర్-అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి 'బ్రహ్మాస్త్ర'పై తన అభిప్రాయాన్ని బయటపెడుతూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు.
"అయాన్ ముఖర్జీని తెరకెక్కించిన 'వేకప్ సిద్', 'యే జవానీ హై దివానీ' భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద బ్లాక్‌బస్టర్స్. 2016లో అయాన్ నన్ను తొలిసారి కలిసి 'బ్రహ్మాస్త్ర' కథ చెప్పాడు. మన హిందూ పురాణాలు ఆధారంగా చేసుకొని రాసిన కథ ఇది. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకొంది. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిపి అస్త్రవర్స్ క్రియేట్ చేశాడు. అసలీ అస్త్రవర్స్ అంటే ఏమిటంటే.. మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం పంచభూతాలు. ఆ పంచభూతాలను శాసించేది బ్రహ్మశక్తి. అలాంటి దాని నుంచి పుట్టిన అస్త్రాలు, వాటిని ప్రయోగించే సూపర్‌హీరోలు.. వారి మధ్య వచ్చే విభేదాలు.. వీటన్నింటినీ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి, అత్యద్భుతమైన విజువల్ వండర్‌లా అయాన్ 'బ్రహ్మాస్త్ర'ను సృష్టించాడు. వీటన్నింటికన్నా బలమైన శక్తి ఇంకొకటి ఉంది. అదే ప్రేమ. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ.. ఎలాంటి శక్తినైనా ఎదుర్కోగలదని అయాన్ ఈ సినిమాలో చూపించాడు" అని రాజమౌళి పేర్కొన్నారు. ఇక 'బ్రహ్మాస్త్ర' తెలుగు వెర్షన్ రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది.