Raj Kundra And Shilpa Shetty News :హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, నటుడు రాజ్ కుంద్రా పెట్టిన ఓ పోస్ట్ సోషల్‌మీడియాలో అలజడి సృష్టించగా.. ఇప్పుడు మరో పోస్ట్ దానికి క్లారిటీ ఇచ్చినట్లైంది. దీంతో శిల్పా శెట్టి అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే?
నటుడు రాజ్‌కుంద్రా.. సోషల్‌మీడియాలో గురువారం అర్ధరాత్రి.. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "మేము విడిపోతున్నాం. దయచేసి ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్‌గా నిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా" అని పోస్ట్ చేశారు. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని కూడా జోడించారు. దీంతో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా విడాకులు తీసుకుంటున్నట్లు తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ శిల్పా శెట్టి.. దీని గురించి ఎక్కడ ప్రస్తావించకపోగా.. ఆమె అభిమానులు ఆ వార్తలను కొట్టిపారేశారు.
ఇదే సమయంలో రాజ్ కుంద్రా మరో పోస్ట్ పెట్టారు. "మాస్క్‌లకు ఫేర్వెల్.. ఇప్పడు వాటితో విడిపోయే సమయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నా ప్రయాణం తదుపరి దశ ప్రారంభం #UT69" అని రాసుకొచ్చారు. దీంతో శిల్పాశెట్టి అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. రాజ్ కుంద్రా పెట్టిన పోస్ట్.. శిల్పా శెట్టితో విడాకులు కాదని.. మాస్కులకు గుడ్‌బై చెప్పే ఉద్దేశంలోనే రాజ్ కుంద్రా అలా ప్రకటన చేశారని అంటున్నారు. విడాకుల వార్తలపై రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి స్పందిస్తారేమో చూడాలి.
వాస్తవానికి రాజ్ కుంద్రా 2022లో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు 2 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన రాజ్, అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా బయట మాస్క్ పెట్టుకునే ఉంటున్నారు. గుమ్మం దాటి బయటకు వస్తే చాలు ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు. మరోవైపు రాజ్ కుంద్రా జీవితం ఆధారంగా UT69 అనే మూవీ వస్తోంది. ఈ సినిమాను షానవాజ్ అలీ దర్శకత్వం వహిస్తుండగా SVS స్టూడియోస్ నిర్మిస్తోంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పడిన మానసిన సంఘర్షణలను ఇందులో చూపనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లోనే రాజ్ కుంద్రా తన మాస్క్ తీసి కనిపించారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.