Pushpa 2 Update : లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప-2 : ది రూల్'. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు బన్నీ. హైదరాబాద్‌లో తాజాగా జరిగిన 'మంగళవారం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన అభిమానుల కోరిక మేరకు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలను రివీల్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
"ఇప్పుడు నేను 'పుష్ప-2' షూటింగ్ ముగించుకునే వచ్చాను. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూట్ జరుగుతుంది. ఈ సీన్స్ కోసమే నేను చేతులకు పారాణీ, గోళ్లకు నెయిల్ పాలిష్ రాసుకున్నాను. అయితే రాబోయే 'పుష్ప-2' మీ ఊహలకు అందకుండా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్. సినిమా విడుదలయ్యాక మీరే చూస్తారు కదూ' అని 'మంగళవారం' సినిమా గురించి పలు విషయాలు చెప్పిన తర్వాత తన సినిమా గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.
'పుష్ప' పార్ట్ 1 ఏ స్థాయిలో చరిత్ర సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదితో పాటు విదేశాల్లోనూ ఓ ఊపు ఊపింది ఈ మువీ. ఇందులో బన్నీ నటనకు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా హిందీ ఫ్యాన్స్ అయితే ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అంతలా అక్కడి వారి అభిరుచులకు అనుగుణంగా మెప్పించారు ఐకాన్ స్టార్. ఇక దీనికి సీక్వెల్‌గానే 'పుష్ప ది రూల్' రూపొందుతోంది. ప్రస్తుతం దీని కోసం అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. మొదటి భాగంలోలా ఇందులోనూ శ్రీవల్లి పాత్రతో ఆమె అలరించనుంది.