పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతోంది. ఆదివారం ప్రభాస్ పుట్టినరోజు. దీంతో శనివారం అర్ధరాత్రి 'ప్రాజెక్ట్ కె' సెట్‌లో ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. టీమ్ సభ్యులు సెట్‌లో భారీగా టపాసులు కాల్చారు. తమ హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
'ప్రాజెక్ట్ కె' పోస్టర్ వచ్చేసిందోచ్..
మూవీ టీమ్ మరో స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'ప్రాజెక్ట్ కె' మూవీ నుంచి ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో ప్రభాస్ చేయి.. సూపర్ హీరో చేయిలా కనిపించింది. "హీరోలు పుట్టరు. ఉద్భవిస్తారు" అన్న క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సూపర్‌హీరో మూవీగా 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన అయిదు యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం.
మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు.