Prabhas Ram Charan Movie : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తన అప్‌కమింగ్ మూవీ 'కల్కి 2898 ఏడీ' సినిమా గ్లింప్స్ విడుదలకు సంబంధించిన ఈవెంట్లో సందడి చేస్తున్నారు. అయితే మూవీ టీమ్ అంతా అక్కడి మీడియాతో మాట్లాడిన సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ప్రభాస్ ఇదే వేదికపై ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
"బాహుబలి, ఆదిపురుష్, సాహో, సలార్, ఇప్పుడు కల్కి 2898 ఏడీ.. ఇలా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో బ్లూ స్క్రీన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి కదా.. మీకు వాటిని చూసి బోర్ కొట్టడంలేదా?" అని ఓ విలేకరి అడగ్గా.. 'మొదట్లో నాకు చాలా బోర్ కొట్టింది. అంత పెద్ద బ్లూ స్క్రీన్ ముందు నేను చాలా చిన్నగా కనిపించేవాడిని. కానీ, గ్లింప్స్ చూశాక ఆనందం వేసింది. బాగుందనిపించింది' అని చెప్పారు.
"ఇండియాలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. 'ఆర్‌ఆర్‌ఆర్' చాలా గొప్ప సినిమా. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అది భారతదేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రాజమౌళి ఇలాంటి వాటికి అర్హుడు. ఇక రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడు. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం" అని అన్నారు. ఈ విషయం విన్న చెర్రీ- డార్లింగ్ ఫ్యాన్స్.. సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అది బిగ్ మల్టీస్టారర్ అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో 'ప్రాజెక్ట్-కె'లో చరణ్ కెమియో చేయనున్నారేమో అని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొదరేమో.. చెర్రీ ప్రొడక్షన్ హౌస్‌లో ప్రభాస్‌తో సినిమా తీస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Prabhas Movies : ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి' ముందు ఆయన ఫాలోయింగ్ రీజనల్ వరకే పరిమితం కాగా.. ఆ ఒక్క సినిమాతో ఆయన దశనే మారిపోయింది. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో జీరో హేట్రెడ్ ఉన్న హీరోల్లో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'ఆదిపురుష్' సినిమాలో మెరిసిన ఆయన.. ఆ తర్వాత 'ప్రాజెక్ట్-K'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ప్రాజెక్ట్-K సినిమాకు 'కల్కి 2898 ఏడీ' అనే టైటిల్‌ను ఖరారు చేసింది మూవీ టీమ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దీపికా పదుకుణె, దిశా పటానీ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.