Prithviraj Sukumaran Kaduva movie: దర్శకుడు, నిర్మాత, గాయకుడు, నటుడిగా రాణిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ నెల 30న 'కడువా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
"2019లో 'కడువా' కథ విన్నప్పుడు 'మేం ఉన్నట్టుండి ఇలాంటి సినిమాల్ని తీయడం ఆపేశాం ఎందుకు?' అనిపించింది. పరిశ్రమలో అన్ని రకాల కథలు తెరపైకొస్తుండాలి. మలయాళం సినిమా అంటే వాస్తవికతతో కూడిన సినిమాలేనా? సామాజికాంశాలతో కూడిన సినిమాలేనా? ఇలాంటి మాస్, యాక్షన్ వినోదంతో కూడిన వాటిని చాలా రోజులుగా మిస్ అవుతున్నాం కాబట్టి ఇది చేయాల్సిందే అనుకున్నా. ఈ చిత్రం 90వ కాలంలో సాగుతుంది. సాధారణంగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాల్ని చేయడాన్ని ఎంతో ఆస్వాదిస్తా. నా ప్రతీ చిత్రం డిఫరెంట్‌గానే ఉంటుంది. నాకు సాంగ్స్ పాడటం అంత ఇష్టం ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్స్ కన్విన్స్ చేస్తే పాడతా.. భవిష్యత్‌లో తెలుగు పాటలు పాడొచ్చు."
"మలయాళ సినిమాల్లో హీరోలను, విలన్లను ఓకే స్థాయిలో చూపిస్తారు. అది నాకు నచ్చుతుంది. 'కడువా' సినిమాలో వివేక్ పాత్ర విలనే అయినప్పటికీ.. హీరో స్థాయిలో ఉంటుంది. 'డ్రైవింగ్ లైసెన్స్', 'అయ్యప్పమ్ కోషియమ్' సినిమాలు చూస్తే ఇది అర్థమవుతుంది. నేను తర్వాత చేయబోయే సినిమా ఇలానే ఉంటుంది. ఇక పాన్ఇండియా విషయానికొస్తే.. అలాంటి సినిమాలు చేయడానికే ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాం. ఎక్కువ మంది చూడాలనే మనం చిత్రాలు చేస్తున్నాం కదా. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వల్ల రీమేక్‌లు తగ్గిపోతున్నాయి. భవిష్యత్‌లో మరింత తగ్గిపోవచ్చు. వేరే భాషల సినిమాలు కూడా సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు."
"తెలుగులో ఇప్పటికే రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు నన్ను సంప్రదించాయి. ఎవరితోనైనా చేయడానికైనా సిద్ధమే. ఎలాంటి కథ చేయాలని ఆలోచిస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. హైదరాబాద్‌లో షూటింగ్ చేయడమంటే ఇష్టం. నేను దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంది" అని అన్నారు.
ఇదీ చూడండి:'రంగమార్తాండ' రిలీజ్‌కు ప్లాన్.. 'పంచతంత్ర కథలు' సాంగ్