తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్​ దేవరకొండ, శివ కార్తికేయన్​ మధ్య తేడా ఏంటో తెలుసా? - శివ కార్తికేయన్​ ప్రిన్స్​ ఈవెంట్​

Prince Movie Pre Release Event: శివ కార్తికేయన్‌ హీరోగా దర్శకుడు అనుదీప్‌ కేవీ తెరకెక్కించిన చిత్రం 'ప్రిన్స్‌'. మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సంగతులు..

విజయ్​ దేవరకొండ, శివ కార్తికేయన్​
విజయ్​ దేవరకొండ, శివ కార్తికేయన్​

By

Published : Oct 19, 2022, 6:53 AM IST

Prince Movie Pre Release Event: నటుడిగా తన కెరీర్‌ రైలులా నెమ్మదిగా ప్రారంభమై ఊపందుకుందని, విజయ్‌ దేవరకొండ కెరీర్‌ రాకెట్‌లా దూసుకెళ్లిందని తమిళ నటుడు శివ కార్తికేయన్‌ అన్నారు. తాను హీరోగా నటించిన 'ప్రిన్స్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహించిన చిత్రమిది. ఉక్రెయిన్‌ నటి మరియా కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు విజయ్‌ దేవరకొండతోపాటు దర్శకుడు హరీష్‌ శంకర్‌ అతిథులుగా హాజరయ్యారు.

శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ.. "ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోని స్మార్ట్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. తన 'గీత గోవిందం' సినిమా నాకు బాగా ఇష్టం. నటుడిగా నేను పదేళ్లు పూర్తి చేసుకున్నా. నా ప్రయాణం రైలులాగా నెమ్మదిగా ప్రారంభమై, అక్కడక్కడా ఆగుతూ మళ్లీ ఊపందుకుంది. విజయ్‌ ప్రయాణం రాకెట్‌లాంటిది. అతి తక్కువ సమయంలోనే పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. అతని జర్నీ స్ఫూర్తినిస్తుంటుంది. విజయ్‌తో కలిసి నటించాలనుంది. త్వరలోనే అది సాధ్యమవుతుందనుకుంటున్నా" అని శివ కార్తికేయన్‌ అన్నారు.

"సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ సినిమాస్‌ సంస్థలు నా కెరీర్‌ను మార్చాయి. అలాంటి ఈ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'ప్రిన్స్‌' ప్రచారంలో నేను భాగంకావటం సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ నాకు చాలా బాగా నచ్చింది. నాకు బోర్‌ కొడితే అనుదీప్‌ రూపొందించిన వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తుంటా. మరియాను భారతీయ చలన చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానిస్తున్నా. శివకార్తికేయన్‌ను కలవటం ఇదే తొలిసారి. నటుడిగా ఆయన ప్రయాణాన్ని నేను ఇష్టపడతా. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ స్టార్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తినిస్తుంటుంది. గతంలో ఓ వేదికపై ఆయన ఏడుస్తూ మాట్లాడటం నన్ను కదిలించింది. అప్పటి నుంచి శివపై నాకు బ్రదర్‌ ఫీలింగ్‌ కలిగింది. ఎప్పుడైనా ఆయనకు తోడుగా నిలవాలనుకున్నా. ఇప్పుడిలా కుదిరింది" అని విజయ్‌ దేవరకొండ చెప్పారు.

"మధ్య తరగతి జీవితాలను అనుదీప్ క్షుణ్ణంగా చదివాడు. ప్రపంచమంతా కొవిడ్‌తో యుద్ధం చేస్తున్నప్పుడు 'జాతి రత్నాలు' సినిమాతో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు.. యుద్ధం జరుగుతున్న దేశం (ఉక్రెయిన్‌) నుంచి అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్‌ను చేశాడు. యుద్ధంలో కూడా నవ్వులు పంచటం సినిమాకే సాధ్యం. ఆ ఉద్దేశంతోనే అనుదీప్‌ ఈ సినిమా తీశాడేమో" అని హరీష్‌ శంకర్‌ పేర్కొన్నారు.

"అనుదీప్‌ చాలా మంచి వ్యక్తి, దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నటించటం చాలా సులువు. భాష పరంగా శివ కార్తికేయన్‌ నాకు సాయం చేశారు. ఆయన మంచి నటుడు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలైన సమయంలో నేను తొలిసారిగా ఇండియా వచ్చి ఈ చిత్రంలో నటించా. కష్టకాలంలో చిత్ర బృందం సపోర్ట్‌ చేసింది" అని మరియా తెలిపారు.

రానా క్షమాపణలు..
ఈవెంట్‌కు హాజరుకాలేకపోవడంతో నటుడు రానా దగ్గుబాటి చిత్ర బృందాన్ని క్షమాపణలు కోరారు. ప్రత్యేక వీడియో ద్వారా మాట్లాడుతూ.. ముంబయిలో విమానం ఆలస్యం కావటంతో రాలేకపోయానన్నారు. శివ కార్తికేయన్‌ మరిన్ని చిత్రాలను నేరుగా తెలుగులో చేయాలని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చదవండి:
ఏంది ఈ అమ్మడు ధరించిన చీర అన్ని లక్షలా
సరోగసిపై సింగర్ చిన్మయి రియాక్షన్​.. ఒక్కఫోటోతో ఆ రూమర్స్​కు చెక్

ABOUT THE AUTHOR

...view details