Prasanth Varma Hanuman Movie : యంగ్ హీరో తేజా సజ్జా లీడ్ రోల్లో వచ్చిన 'హనుమాన్' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌గా దూసుకెళ్తోంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ.100కోట్ల వసూళ్లు అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే అటు థియేటర్లలో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సందడి చేస్తుండగా, తాజాగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఇతిహాసాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
"ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు రూపొందాయి. సీనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి చిత్రాలు ఎన్నో చేశారు. కానీ, ఆయన ఎప్పుడూ విమర్శలను ఎదుర్కోలేదు. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియెన్స్ పండగ చేసుకునేవాళ్లు. మాకు ఎన్టీఆరే రాముడు, కృష్ణుడు. చాలా ఇళ్లలో ఇప్పటికీ దేవుడి విగ్రహాలతో పాటు ఆయన పోస్టర్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ సినిమాల్లో దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదు. నేను ఈ జానర్‌లో వచ్చిన సినిమాలన్నింటినీ చూస్తాను. కొన్ని చూసినప్పుడు నేను సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటే, మరికొన్నింటి వల్ల ఎలా తీయకూడదో తెలుసుకున్నాను. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు. జాగ్రత్తగా తెరకెక్కించాలి. నేను ఇతర డైరెక్టర్ల గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. మన సంస్కృతిని, చరిత్రను ఎప్పుడూ తప్పుగా చూపించను. రామాయణ, మహాభారతాలను ఇప్పటి ఆడియెన్స్‌కు నా స్టైల్లో చెప్పాలనుకుంటున్నాను. కానీ, వాటిని తీసేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. అందుకే వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొత్తగా కల్పిత కథలను రూపొందిస్తున్నాను. మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు కానీ, కావల్సినంత టైమ్ ఉంది. అందుకే ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వీఎఫ్ఎక్స్ కోసం పెద్ద చిత్రాల కంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాం. హాలీవుడ్‌లో సూపర్ హీరోల సినిమాల్లో చూపించే శక్తుల కంటే మన దేవుళ్ల దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయి. అలాంటి పాత్రలే మన ఇతిహాసాల్లోనూ కనిపిస్తాయి. హనుమాన్ కూడా అలాంటి ఓ శక్తిమంతమైన పాత్రే. నేను సూపర్ హీరోల సినిమాలను తీయాలని నిర్ణయించుకున్న సమయంలో హనుమంతుడితోనే ప్రారంభించాలనుకున్నా. ఇప్పుడు అదే చేశాను" అంటూ ఇతిహాసాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.