Prakash Raj Tweet Chandrayaan 3 :సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన 'చంద్రయాన్ 3' పై పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారడం వల్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చంద్రయాన్ 3' గురించి దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వేళ ప్రకాశ్ రాజ్ దీనిపై వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు.
కేసు నమోదు..
Case On Prakashraj : తాజాగా కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లాలో నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు.. మంగళవారం తెలిపారు. జిల్లాలోని బనహట్టి పోలీస్ స్టేషన్లో ప్రకాశ్‌రాజ్‌పై హిందూ సంస్థల నాయకులు ఫిర్యాదు చేశారని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేమైందంటే?
Prakash Raj Twitter Chandrayaan : చంద్రుడి పైనుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన తొలి ఫొటో ఇదేనంటూ ఓ చాయ్ వాలా ఫొటోను ప్రకాశ్ రాజ్.. ఆదివారం ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్ అవ్వడం వల్ల ఆయనపై నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. అయితే తన ట్వీట్‌కు సమాధానంగా మరో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. "విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూడగలదు. నేను కేవలం కేరళ చాయ్ వాలా గురించి మాత్రమే పోస్ట్ పెట్టాను. మరి ట్రోలింగ్ చేసిన చాయ్ వాలా ఎవరు? జోక్ ని జోక్ లాగే చూడాలి. లేకపోతే అది మన పైనే అనుకోవాల్సి వస్తుంది. గ్రో అప్" అంటూ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
వేయికళ్లతో..
ISRO Chandrayaan 3 Landing :జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ భారతీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌ను నిరంతర తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.