ప్రముఖ నటుడు ప్రభాస్ దసరా సందర్భంగా దిల్లీలోని ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో రావణ దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రానున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, 15 దేశాలకు చెందిన రాయబారులు కూడా హాజరవుతారు. ఈ మేరకు లవ్ కుష్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ వివరాలు వెల్లడించారు. అయితే ఆదివారం టీజర్ కార్యక్రమం ముంగించుకుని దిల్లీ చేరుకున్నారు ప్రభాస్. అయితే దసరా సందర్భంగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లేదా హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. అనంతరం సాయంత్రం రామ్‌లీల రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రభాస్‌ను చూసేందుకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా పాసులను ప్రజలకు పంపిణీ చేశారు. అదనంగా మరో రెండు లక్షల పాస్‌లు ముద్రిస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఇంత పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు జరగలేదు. దీంతో ఈసారి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. అయితే గత 4 రోజులుగా రోజుకు 50 వేల మంది దాకా వస్తున్నారని లవ్కుష్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు తెలిపారు.