PRABHAS SITARAMAM EVENT: "కొన్ని చిత్రాలను థియేటర్లోనే చూడాలి. 'సీతారామం' థియేటర్లోనే చూడాల్సిన సినిమా" అన్నారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం హైదరాబాద్‌లో 'సీతారామం' ముందస్తు విడుదల వేడుక జరిగింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మృణాల్ ఠాకూర్ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
PRABHAS SITARAMAM SPEECH: ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో తొలి టికెట్‌ని కొన్న అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ "మా సినిమా రంగానికి థియేటరే గుడి. ఆ గుడి ప్రేక్షకులు ఇచ్చిందే. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? గొప్ప నటులు, సాంకేతిక బృందం కలిసి చేసిన ఈ సినిమాని అందరం థియేటర్లలోనే చూద్దాం. దేశంలో ఉన్న హ్యాండ్సమ్ హీరో, స్టార్ దుల్కర్. అందరూ దుల్కర్, మృణాల్ నటన గురించి చెబుతున్నారు. చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఇందులో ప్రేమకథే కాదు, యుద్ధంతోపాటు ఇతర అంశాలూ ఉన్నాయని చెప్పారు నాగ్ అశ్విన్. రష్యాలో చిత్రీకరించిన తెలుగు సినిమా ఇదేనేమో నాకు తెలిసి. దర్శకుడు హను రాఘవపూడి సినిమాలు చూశా. కవితాత్మకంగా తీస్తుంటారు. ఇందులో సుమంత్ చేశారంటే ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వినీదత్ తెలుగు పరిశ్రమలో ఉండటం గొప్ప విషయం" అన్నారు.
స్వప్నదత్ మాట్లాడుతూ "ప్రభాస్ బయటికి రారు. మాకోసం, సినిమాని బతికించేందుకోసం ఈ వేడుకకి వచ్చారు. నటులంతా గుర్తుండిపోయే పాత్రల్ని పోషించారు. ఇలాంటి సినిమాలు తీద్దామన్నప్పుడు వాణిజ్యాంశాల గురించి ఆలోచించకుండా వెన్నుదన్నుగా నిలవడం మామూలు విషయం కాదు. మా నాన్నవల్లే ఈ సినిమా చేశాం" అన్నారు.
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ "నేనూ, ప్రియాంక 'ప్రాజెక్ట్ కె'లో నిమగ్నం కాగా, స్వప్న ఒక్కటే దీన్ని పూర్తి చేశారు. 170 రోజులు చిత్రీకరణ చేశారు. 'ఓ సీత కథ'తో పరిశ్రమలోకి వచ్చిన నేను ఎప్పటికైనా ఒక మంచి ప్రేమకథ తీయాలనుకునేవాణ్ని. అది ఈ సినిమా రూపంలో జరిగింది" అన్నారు.