Salaar Teaser : 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురైంది'.. అంటూ ప్రభాస్ అభిమానులు పాడుకోవాల్సిన సమయం దగ్గరపడింది. జున్ 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో.. రీసెంట్గా 'ఆదిపురుష్' రిజల్ట్‌తో డీలా పడిన ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీజర్ అప్డేట్ రూపంలో మరో ఆశ చిగురించింది. 'కేజీయఫ్' సిరీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇక విషయానికొస్తే.. ఇప్పుడందరి మదిలో టీజర్‌ను అంత పొద్దున్నే 5:12 గంటలకు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అని తెగ మాట్లాడుకుంటున్నారు. ఏమైనా సెంటిమెంటా? లేదా ఇంకేమైనా ఉందా? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఓ కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.
అదేంటంటే.. ఇప్పటికే 'సలార్'-'కేజీయఫ్'కు లింక్ ఉందని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీజర్ టైమ్.. 'కేజీయఫ్ 2'లో రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో ఉన్న గడియారంలో ఉన్న సమయం ఒకట్టే. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. దీంతో ఈ సినిమాపై అంచనాలో ఊహించలేని స్థాయికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు తెగ సందడి చేస్తున్నాయి. నిజానికి రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో మూడు నాలుగు గడియారాలు ఉన్నాయి. ఒక్కో గడియారంలో ఒక్కో సమయం ఉంది. అందులో ఒకటి 5:12.