తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​, చిరంజీవితో సినిమా.. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ రియాక్షన్​ ఇదే! - prabhas salaar

Salaar movie Prithviraj: రెబల్​స్టార్​ ప్రభాస్, మెగాస్టార్​ చిరంజీవితో కలిసి సినిమా చేసే విషయమై మాట్లాడారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్. ఏం అన్నారంటే..

Salaar Prithviraj
సలార్​ పృథ్వీరాజ్​

By

Published : Jun 25, 2022, 8:46 PM IST

Salaar movie Prithviraj: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సలార్‌'. అయితే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నటించనున్నారని కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి.​ అయితే తాజాగా ఈ విషయమై మాట్లాడారాయన. ఈ మూవీలో నటించే అవకాశం రెండేళ్ల కిందటే వచ్చిందని తెలిపారు. కానీ, అనుకోని కారణాల వల్ల చేయలేకపోయానని వెల్లడించారు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.

'తెలుగులోనే నేరుగా సినిమా ఎప్పుడు చేస్తారు' అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. "త్వరలోనే ఆ విషయం మీకు చెబుతా. తెలుగు చిత్రాన్ని చేయాలని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. షూటింగ్‌ డేట్స్‌ విషయంలో ఇంకా కసరత్తు జరుగుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'సలార్‌'లో ఓ ముఖ్య పాత్ర చేయమని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండేళ్ల కిందటే అడిగారు. అప్పుడే నాకు కథ కూడా వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా అద్భుతంగా ఉంది. నేను కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ఎందుకంటే ప్రశాంత్‌, హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మాతలు నాకు స్నేహితులు. అంతకుమించి అది ప్రభాస్‌ సినిమా. అతనితో నటించాలని నాకూ ఉంది. కానీ, కరోనా కారణంగా మలయాళంలో నా సినిమాలకు సంబంధించిన డేట్స్‌ అన్నీ మారిపోయాయి. దీంతో సినిమా చేయలేనని ప్రశాంత్‌కు చెప్పా. అయితే, అదే కరోనా కారణంగా ప్రభాస్‌ సినిమా డేట్స్‌ విషయంలో కూడా మార్పులు జరిగాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అన్నీ కుదిరితే నేను 'సలార్‌' భాగస్వామిని అవుతా. శనివారం రాత్రి ప్రశాంత్‌నీల్‌ను కలుస్తా. అతనితో మాట్లాడిన తర్వాత నేను నటించే విషయమై స్పష్టత వస్తుంది. తప్పకుండా తెలుగు సినిమా చేస్తా. అంతేకాదు, దర్శకత్వం చేసే అవకాశం కూడా ఉంది. కొన్ని నిర్మాణ సంస్థలు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించమని నన్ను సంప్రదించాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇతర ఇండస్ట్రీలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ బిజినెస్‌ మోడల్‌లా నిలిచింది" అని అన్నారు.

'మీరు ఒక తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలంటే ఏ హీరో మూవీని డైరెక్ట్‌ చేస్తారు' అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ను బట్టి దర్శకత్వం వహిస్తా. అందులోని పాత్రకు ఎవరు సరిగ్గా సరిపోతారో వారితోనే సినిమా చేస్తా. అయితే, చిరంజీవి సర్‌ 'గాడ్‌ ఫాదర్‌' చేయటం చాలా సంతోషంగా ఉంది. 'లూసిఫర్‌' తర్వాత దాని తెలుగు వెర్షన్‌ తీయాలనుకున్నప్పుడు నా మొదటి ఛాయిస్‌ చిరంజీవిగారే. ఇదే విషయాన్ని ఆయనకూ చెప్పా. అయితే నాకున్న కమిట్‌మెంట్స్‌ కారణంగా సినిమా చేయడానికి కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమాను ఆయన చేయడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవిగారితో కలిసి నటిస్తా. 'సైరా'లో ఓ పాత్ర చేయమని ఆయన నన్ను అడిగారు. కానీ, నేను అప్పుడు ఓ సినిమా షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లా. మరొక విషయం ఏంటంటే.. ఇప్పటికీ ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదు. అదే 'ఆడుజీవితం' అని పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీరాజ్‌ నటించిన 'కడువా' జూన్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో పోషించారు.

ఇదీ చూడండి: ప్రేమకావ్యం 'టైటానిక్' మళ్లీ వస్తోంది.. ఈసారి సరికొత్తగా !

ABOUT THE AUTHOR

...view details