Prabhas Salaar Interview :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రూపొందించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. తాజాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ లిస్ట్‌లో చేరింది. తాజాగా ఓ హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
"సలార్ కథ నాకెంతో నచ్చింది. విన్న వెంటనే అంగీకరించాను. నాకెరీర్‌లో చేసిన భిన్నమైన పాత్రల్లో ఇది ఒకటి. ఎంతో సవాలుతో కూడుకుంది. 'బాహుబలి' నా కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నా. అందులో భాగంగానే 'సలార్'కు ఓకే చెప్పాను. అలాగే ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తిస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్‌నీల్ వంటి దర్శకులతో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. 'సలార్ పార్ట్ 1' చివరిలోనే రెండో భాగం ఉంటుందని స్పష్టం చేశాం. మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండోది మరింత అద్భుతంగా ఉంటుంది" అని ప్రభాస్ చెప్పారు.
Prithviraj Sukumaran On Salaar Violence : తాజాగా రిలీజైన యానిమల్ , సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లోనూ వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. "అన్ని సినిమాలు విడుదలకు ముందు సెన్సార్ బోర్డుకు వెళ్తాయి. సెన్సార్ వాళ్లు ఇచ్చే సర్టిఫికెట్‌ను బట్టి సినిమాలో ఉండే కంటెంట్ ప్రేక్షకులకు దాదాపు అర్థమైపోతుంది. సినిమా తీసే విషయంలో డైరెక్టర్లకు ఫ్రీడమ్ ఇవ్వడం ముఖ్యం. రీసెంట్గా రిలీజైన యానిమల్‌లో వైలెన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. కానీ నేను ఆ సినిమా చూడలేదు. మా సినిమా (సలార్) విషయానికొస్తే కొన్ని సీన్స్‌లో వైలెన్స్ ఉంది. వైలెన్స్ ఆ సీన్స్‌లో అవసరం. అందుకే దర్శకుడు అలా తెరకెక్కించారు. ఆ సన్నివేశాలే స్టోరీని నడుపుతాయి. హింస కంటే ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఎక్కువే. అవి గుండెల్ని తాకుతాయి. అందుకే ఈ సినిమాను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తో పోల్చుతా" అని పృథ్వీరాజ్ అన్నారు.