Radhe shyam movie: అనేక పరిస్థితులను దాటుకుని ఐదేళ్ల పాటు ఒక సినిమా కోసం పనిచేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమని, ఆ క్రెడిట్ అంతా దర్శకుడు రాధాకృష్ణకే దక్కుతుందని అగ్రకథానాయకుడు ప్రభాస్ (Prabhas) అన్నారు. పూజాహెగ్డే (Pooja Hegde)తో కలిసి ఆయన నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ (Radhe Shyam). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘గోపీకృష్ణ బ్యానర్‌పై మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చేశాం. ఇది లవ్‌స్టోరీయే కానీ, అంతకుమించి ఉంటుంది. కొవిడ్ సమయంలో చిత్ర బృందం చాలా కష్టపడింది. రెండేళ్లు జార్జియ, ఇటలీ తదితర దేశాల్లో చిత్రీకరణ జరిపారు. అందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ చాలా అందంగా ‘రాధేశ్యామ్’ను తీర్చిదిద్దారు. దర్శకుడు రాధాకృష్ణ ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. నిజంగా ఆయన ఓపికను మెచ్చుకోవాలి. సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుంది. అభిమానుల వల్లే ఈ కార్యక్రమం ఇంతా బాగా జరిగింది’’ అని అన్నారు.
'రాధేశ్యామ్'లో లవ్‌స్టోరీకి మించిన ట్విస్టులు: ప్రభాస్
Prabhas radhe shyam: 'రాధేశ్యామ్' అద్భుతమైన ట్విస్టులు ఉంటాయని ప్రభాస్ చెప్పారు. అలానే క్లైమాక్స్ కొత్తగా ఉంటుందని అన్నారు.
అంతకుముందు దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా తీయడానికి నాలుగేళ్లు పట్టింది. రాయడానికి 18 సంవత్సరాలు పట్టింది. మొదటిసారి ఈ పాయింట్ నా గురువు చంద్రశేఖర్ యేలేటిగారి దగ్గర విన్నాను. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రచయితలను అందరినీ రప్పించి రాయించాం. కానీ, కథకు ఒక ముగింపు దొరకలేదు. ఆ సమయంలో యేలేటి గారు ఒకమాట అన్నారు. ‘ఈ కథ జాతకాల మీద చేస్తున్నావు. ఎవరికి రాసి పెట్టి ఉందో’ అన్నారు. ఇది ప్రభాస్ గారికి రాసిపెట్టి ఉంది. ఆయనతో ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు, ఈ పాయింట్ మా గురువు దగ్గర తీసుకుని ఒక ఫిలాసఫీని లవ్ స్టోరీగా చేసి, కథ రాసి ఆయనకు చెప్పాను. ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం ఉండవు. ఒక అమ్మాయికి అబ్బాయికీ మధ్య జరిగేయుద్ధాలే ఉంటాయి. అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్త సముద్రాలు దాటుకుంటూ ఎలా వెళ్లాడన్నది కథ. మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా చూసిన తర్వాత తప్పకుండా నచ్చుతుంది. మనోజ్ పరమహంస ప్రతి సన్నివేశాన్ని బృందావనంలో చూపించారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ లేకపోతే ఈ సినిమా లేదు. పూజా హెగ్డే.. ప్రేరణ పాత్ర కోసమే పుట్టిందేమో. ప్రభాస్ నా కోసం చాలా చేశారు. మీలాంటి స్నేహితుడు ప్రతి ఒక్కరికీ ఉండాలి. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. జనవరి 14న అందరూ రండి.. ప్రేమించుకుందాం’’ అని అన్నారు.