Prabhas Project K movie: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె'ఒకటి. దీన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థ రూపొందించిన దుల్కర్ సల్మాన్ 'సీతారామం' విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్.. సీతారామం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 'ప్రాజెక్ట్ కె' గురించి కూడా మాట్లాడారు. చైనా, అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్‌కు సీక్వెల్ కూడా ఉండొచ్చని, 'అవెంజర్స్' తరహాలో దీన్ని తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభాస్ పాత్ర టెర్రిఫిక్‌గా ఉంటుందని, అక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను.. ఎన్నడూ చూడని విధంగా చూస్తారని చెప్పారు. ఈ సినిమాను చూశాక.. అభిమానులు తప్పకుండా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు. 2023 నాటికి షూటింగ్‌ను పూర్తి చేసి అక్టోబర్ 18న లేదా 2024 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందని చెప్పారు. 'ప్రాజెక్ట్ కె' తర్వాత 'జగదేకవీరుడు' సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేశారు అశ్వనీ దత్. ఇంకా తమ బ్యానర్లో నందిని రెడ్డి-నాగచైతన్య కాంబోలో ఓ సినిమా, శ్రీకాంత్ తనయుడు రాకేష్ రోషన్‌తో ఓ మూవీ ఉంటుందని పేర్కొన్నారు.
చిత్రసీమపై ఘాటు వ్యాఖ్యలు.. సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం ఇప్పుడొక సవాల్‌గా మారిందని అశ్వినీదత్ అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారు. ఇంకా చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం తీరుపైనా మండిపడ్డారు. "నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్ బంద్’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.