Prabhas Kannappa Movie : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఆలయంలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ నటించనున్నారని.. అది కూడా పరమశివుడి పాత్రలో కనిపించనున్నారంటూ ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయింది. దీన్ని సినిమా క్రిటిక్ రమేశ్ బాలా తన ట్వీట్లో వెల్లడించగా.. దానికి.. 'హర హర మహాదేవ్' అని విష్ణు రిప్లై ఇచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేయడం ప్రారంభించారు. అయితే ఓ అభిమాని "భక్త కన్నప్ప ప్రాజెక్ట్ లో ప్రభాస్. నిజమేనా... నిజమైతే... సూపర్" అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్‌పై ఓ ఎమోజీతో విష్ణు స్పందించారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కన్ఫార్మ్ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై విష్ణు ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్‌ని మూడోసారి దేవుడి పాత్రలో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఆయన ఇప్పటికే 'ఆదిపురుష్'లో రాముడిగా కనిపించారు. 'కల్కి'లో విష్ణు మూర్తిగా కనిపించనున్నట్లు సమాచారం.
Kannappa Movie Cast : మరోవైపు ఈ సీనిమాలో విష్ణుతో పాటు బాలీవుడ్ స్టార్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ నటించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
"మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలుకాదు. అందుకోసం ఈ సినిమా నిర్మాణానికి ఆర్నెల్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ కథకి కీలకమైన మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తారు. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం" అని ఈ సినిమా ఓపెనింగ్ రోజు విష్ణు తెలిపారు.
రూ.60 కోట్ల బడ్జెట్ సినిమాలో హీరో విష్ణు
యాక్షన్ మూవీగా మంచు విష్ణు 'భక్త కన్నప్ప'!