పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు పండగే. వచ్చే ఏడు నెలల్లో డార్లింగ్ నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ మేకర్స్ విడుదల తేదీలను ప్రకటించగా.. తాజాగా ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తెలిపింది. 2024 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పింది. మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ వచ్చే ఏడాది జనవరి 12న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆడిపాడనుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కనువిందు చేయనుంది. మహానటి ఫేమ్ డెరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో సుదీర్ఘమైన అయిదు యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం. వీటిని తెరకెక్కించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను సిద్ధంగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.