రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక 'ట్రిబెకా ఫెస్టివల్'లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఓం రౌత్ తెలియజేశారు.
"ఇది గౌరవం, సంతోషానికంటే మించింది. 2023 జూన్ 13న 'ఆదిపురుష్' న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ని. ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని ఓం రౌత్ తెలిపారు. ఇక ఈ వేడుక జూన్ 7 నుంచి 18 వరకు న్యూయార్క్‌లో అట్టహాసంగా జరగనుంది.
ఇక సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్‌తో త్రీడీలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్.. రామునిగా నటించారు. జానకి పాత్రలో కృతి సనన్, లంకేశునిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్ 16న థియేటర్లలో రిలీజవ్వనుంది.
రన్‌టైమ్‌పై క్లారిటీ..
జూన్‌లో రిలీజవ్వనున్న ఈ సినిమా రన్‌టైమ్ గురించి నెట్టింట్లో తెగ చర్చలు జరిగింది. అయితే ట్రిబెకా అఫీషయల్ వెబ్సైట్ ద్వారా 'ఆదిపురుష్' రన్‌టైమ్ విషయంపై పై ఓ క్లారిటీ వచ్చింది. దీని ప్రకారం సినిమా నిడివి 174 నిమిషాలు ఉంటుందని తెలిసింది. అంటే సుమారు 2 గంటల 54 నిమిషాలు. గతంలో ఈ సినిమా రన్‌టైమ్‌పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొదట్లో ఈ టైమ్‌ను 3 గంటల 16 నిమిషాలకు ఫిక్స్ చేశారని టాక్ కూడా నడిచింది.
వివాదాలు, విమర్శలు..
గతేడాది దసరాకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్‌ను చూసిన అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్ లేదని.. రావణాసురుడు, హనుమంతుడి లుక్స్‌తో పాటు వీఎఫ్ఎక్స్ బాగోలేదని అంటూ నెట్టింట విమర్శలు గుప్పించారు. 'ఆదిపురుష్' సినిమా మొత్తం యానిమేషన్లా ఉందని ట్రోల్ చేశారు. ముఖ్యంగా రావణుడి, ఆంజనేయుడి పాత్రలను వక్రీకరించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తోలు వస్తువులు ఉపయోగించినట్లు ఆరోపించారు. అంతే కాకుండా, ఈ సినిమాకు అప్పట్లో బాయ్‌కాట్ సెగ కూడా తాకింది. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.