BRO Movie Review :సినిమా : బ్రో; స్టార్స్ : పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్, ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు. మ్యూజిక్ : తమన్; ఎడిటింగ్: నవీన్ నూలి; సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్; రచన: సముద్రఖని, శ్రీవత్సన్, విజ్జి; స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్; దర్శకత్వం: సముద్రఖని; రిలీజ్ డేట్: 28-07-2023
పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఇక అభిమానులకు పండగనే చెప్పాలి. ఇప్పటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పవన్.. తాజాగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి 'బ్రో' అనే సినిమాలో నటించారు. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన 'వినోదయసిత్తం' రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ లీడ్ రోల్లో రూపొందిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తమిళ సినిమా 'వినోదయ సిత్తం' నుంచి ఏం తీసుకున్నారు. ఏయే మార్పులు చేశారు? ఇటువంటి విషయాలు తెలియాలంటే కథ గురించి తెలుసుకుందాం..
స్టోరీ ఏంటంటే : ఇంటికి పెద్ద కుమారుడైన మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధరమ్ తేజ్).. తన తండ్రి మరణం తర్వాత అన్ని బాధ్యతల్నీ భుజాన మోస్తుంటాడు. ఇద్దరు చెల్లెళ్లు, ఓ తమ్ముడు స్థిరపడాలని కలలు కన్న తను ఉద్యోగంలోనూ మరింత ఎత్తుకు ఎదగాలని నిరంతరం శ్రమిస్తుంటాడు. అయితే ఊహించని రీతిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మార్క్ మరణిస్తాడు. దీంతో తనవాళ్లెవరూ జీవితంలో స్థిరపడలేదని, తాను చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయాయని... తన జీవితాన్ని ఇంత తొందరగా ముగింపునివ్వడం అన్యాయమని కాలం (పవన్‌కల్యాణ్) అనే దేవుడి ముందు మొరపెట్టుకుంటాడు. దీంతో కాలం అనుగ్రహించి 90 రోజులకు అతని జీవితకాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ తన ఇంటికి చేరిన మార్క్ తనకు దొరికిన 90 రోజుల్లో అనుకున్నవన్నీ చేశాడా? లేక అతనివల్లే పనులన్నీ అయ్యాయా? ఇంకా ఆ 90 రోజుల్లో మార్క్ ఏం తెలుసుకున్నాడు అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే: టాప్ హీరోల సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కీ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇక పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులకి కిక్ ఇచ్చేలా తాజా అంశాల్ని జోడిస్తూ వాళ్లని సంతృప్తిపరచాల్సిందే. మరి ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా.. కథే మెయిన్‌గా సాగే 'వినోదాయ సిత్తమ్'ని పవన్ కల్యాణ్‌తో రీమేక్ చేయడం అనేది పెద్ద రిస్కే. అయితే ఆ విషయంలో ఉన్న సందేహాలన్నిటినీకి చెక్ పెట్టేలా పవన్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్రమ్ ఈ స్టోరీని తనదైన రచన శైలిలో మలిచారు. అలా పవన్ కల్యాణ్ ఓల్డ్ సినిమాల్లోని పాటలు ... ఆయన మార్క్ మేనరిజమ్స్... ఇంకా కొన్ని ఫేమస్ గెటప్స్ అన్నింటినీ ఈ సినిమాలోని సీన్స్‌కు తగ్గట్టుగా మలిచారు. అవిన్నీ థియేటర్లో అభిమానుల చేత కేకలు పెట్టించేలా ఉన్నాయి.
మరోవైపు పవన్‌కల్యాణ్ చెప్పే డైలాగ్స్ కూడా ఆయన భావాలు ... రాజకీయ సిద్ధాంతాలకి అనుగుణంగా కనిపించాయి. దీంతో ఈ సినిమా పవన్ వీరోచితంగా ఫైట్లు చేయడం లేదనే విషయాన్ని కూడా మరిపించాయి. అలాగే పవన్ రోల్ కూడా ఔచిత్యానికి తగ్గట్టుగానే తాను చిటికె వేసిన ప్రతిసారీ హీరోయిజం పండిస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న దర్శకుడు సముద్రఖని ప్రధాన కథకి ఎక్కడా సమస్య రాకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు.