Popular Tollywood Songs of the Year 2023 : ఓ సిినిమా అంటే అందులోని స్టోరీ, స్టార్స్‌తో పాటు సాంగ్స్ కూడా పాపులర్ అవుతుంటాయి. కొన్ని సార్లు సినిమాలు అభిమానులను నిరాశపరిచినా అందులోని సాంగ్స్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంటాయి. అలా కొన్ని పాటలను వన్స్‌మోర్ అంటూ మళ్లీ మళ్లీ వింటుంటాం. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొన్ని పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అవేంటంటే?
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వీరసింహారెడ్డి'లో హీరో బాలకృష్ణ పేరు మీద వచ్చిన 'జై బాలయ్యా' సాంగ్ ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ నోట నానుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్‌కు దాదాపు నాలుగు కోట్ల వ్యూవ్స్ దాటాయి. ఇక ఇదే సినిమాలో 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే' అనే సాంగ్ కూడా రెండు కోట్ల వ్యూస్ అందుకుని ట్రెండింగ్‌లో ఉంది.
ఇక సంక్రాంతి రేసులోకి ఎంట్రీ ఇచ్చిన మరో మూవీ 'వాల్తేరు వీరయ్య' ఇందులోని పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. 'వేరీజ్ ద పార్టీ','పూనకాలు లోడింగ్' సాంగ్స్ ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతూ దాదపు నాలుగు కోట్ల ఇరవై లక్షల వీక్షకుల్ని అందుకున్నాయి.
'దసరా'లోని 'చమ్కీల అంగీలేసి ఓ వదినే' అనే పాట క్రియేట్ చేసిన సెస్సేషన్ అంతా ఇంతా కాదు. కేవలం గ్లింప్స్‌తోనే ఆ పాట అందరి నోట నానగా, ఆ తర్వాత రీల్స్‌లోనూ తెగ ట్రెండ్ అయ్యి అందరీ ఫేవరెట్‌గా మారిపోయింది. ఇక ఈ పాట పాడిన డీ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ పాట సుమారు పన్నెండు కోట్ల వ్యూస్‌తో రికార్డుకెక్కింది. మరోవైపు ఇదే సినిమాలో 'ధూంధామ్ దోస్తాన్' పాట కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
ఈ ఏడాది చివర్లో వచ్చిన 'కోటబొమ్మాళి పీఎస్'లోని 'లింగిలింగి లింగిడి' సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని లిరిక్స్, మ్యూజిక్కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో ఎక్కడ చూసిన ఈ పాట తెగ ట్రెండ్ అయ్యింది. ఈ సాంగ్ సుమారు అయిదుకోట్ల వ్యూవర్స్‌ను అందుకుంది. ఇక కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో తెరకెక్కిన 'రూల్స్ రంజన్'లో 'సమ్మోహనుడా' సాంగ్‌కు మంచి గుర్తింపు లభించింది.