ప్రముఖ బుల్లితెర టీవీ షో సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ నటి వైభవీ ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం జరిగిన ఓ కారు ప్రమాదంలో ఈ 32 ఏళ్ల నటి తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ సినీ, టెలివిజన్ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా మంబయిలో బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయంటూ కుటుంబసభ్యులు తెలిపారు.
ఓ ప్రముఖ వార్తా పత్రిక ఇచ్చిన సమచారం ప్రకారం.. వైభవీకి తరచుగా ప్రయాణం చేయటం చాలా ఇష్టమట. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్‌లో వైభవీ తన కాబోయే భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మలుపుతిప్పుతున్న టైమ్‌లో అడుపుతప్పి కారు బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం మరింత తెలియాల్సి ఉంది. అభిమానులతో పాటు బుల్లితెర నటీనటులు ఆమెకు నివాళులు అర్పిస్తూ.. వైభవీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
వైభవీతో కలిసి సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ టేక్ 2లో నటిచిన బాలీవుడ్ నటుడు, నిర్మాత జేడి మజేథియా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో నటి వైభవీ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. 'జీవితం చాలా అనూహ్యంగా ఉంటుందంటే నమ్మశక్యం కాదు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ షో ద్వారా వైభవీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో జాస్మిన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటి, నా స్నేహితురాలు వైభవీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారన్న వార్త నన్ను కలవరపరిచింది. వైభవీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆమె మరణాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. బుధవారం ఉదయం 11 గంటలకు ముంబయిలో వైభవీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెస్ట్ ఇన్ పీస్ వైభవీ' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా వైభవీ ఉపాధ్యాయ 'ప్లీజ్ ఫైండ్ అటాచ్', 'జీరో కేఎమ్ఎస్','సారాభాయ్ వర్సెస్ సారాభాయ్', 'అదాలత్','సీటీ లైట్స్','సావధాన్ ఇండియా' ఇంకా మరికొన్ని టీవీ సీరీస్‌ల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించిన 'ఛపాక్' సినిమాలో వైభవీ.. మీనాక్షిగా కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది మార్చ్ 31న హిందీలో విడుదలైన 'తిమిర్'లో ప్రధాన పాత్రలో నటించింది.+
బాత్రూమ్లో మరణించిన మరో నటుడు..
రెండు రోజుల క్రితం 32 ఏళ్ల బాలీవుడ్ యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలోని బాత్రూమ్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్య ముంబయి అంధేరీలో లష్కరియా హైట్స్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే సోమవారం మధ్యాహ్నం బాత్రూమ్లో నిర్జీవంగా పడి ఉన్న ఆదిత్యను చూసిన అతడి స్నేహితుడు.. వాచ్మెన్ సాయంతో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆదిత్య మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నందున ఆదిత్య చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆదిత్య పోస్ట్ మార్టం నివేదికగా ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఆదిత్య.. మోడల్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా పలు చిత్రాల్లో నటించారు.