Pooja Hegde: సుమారు పదేళ్ల తర్వాత 'బీస్ట్'తో కోలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించనున్నారు నటి పూజాహెగ్డే. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా నటించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'బీస్ట్' ప్రమోషన్స్‌లో భాగంగా పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 'బీస్ట్' గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
"'బీస్ట్' పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనుకుంటున్నా. విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. 'బీస్ట్'తో అది నెరవేరింది. విజయ్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. వృత్తి పట్ల ఆయన చూపించే అంకితభావం, కష్టపడేతత్వం నాలో స్ఫూర్తి నింపాయి. 'బీస్ట్' షూట్ డేస్‌ని ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే.. నా బర్త్‌డే అని తెలుసుకుని.. విజయ్ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. అంత పెద్ద స్టార్ హీరో నాకోసం సర్‌ప్రైజ్ పార్టీ ప్లాన్ చేయడం నేనెప్పటికీ మర్చిలేను"
-పూజాహెగ్డే, హీరోయిన్
కాస్ట్యూమ్‌పై రక్తపు మరకలు: ఈ సినిమా మొత్తం ఒకటే కాస్ట్యూమ్‌తో ఉంటారు పూజా. అయితే ఒకటే కాస్ట్యూమ్‌పై నటించడం ఎలా ఉందో వివరించారామె. "కాస్ట్యూమ్‌ల సంఖ్య చూసి సినిమాలను ఎంచుకోము. అయితే ఒక్కటే కాస్ట్యూమ్ ఉండటం వల్ల తయారు కావడానికి పెద్దగా శ్రమ పడనక్కర్లేదు. ఒకే కాస్ట్యూమ్‌కు సంబంధించి నాకు 5 జతలు ఇచ్చారు. ఎందుకంటే కొన్ని సీన్లలో నా కాస్ట్యూమ్‌పై రక్తం ఉండాలి." అని పూజా చెప్పారు.
విపరీతంగా నవ్వుకున్నా:"నెల్సన్ మంచి దర్శకుడు. ఆయనకొక విభిన్నమైన స్టైల్ ఉంది. ఆయన తెరకెక్కించిన 'కోకిల' సినిమా నాకెంతో నచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత నేను యోగిబాబుకి అభిమాని అయిపోయా. ఆ సినిమాలో యోగిబాబు కామెడీ మరోస్థాయిలో ఉంటుంది. ఇక, 'డాక్టర్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రాన్ని నేను రెండుసార్లు చూశా. విపరీతంగా నవ్వుకున్నా"