Payal Rajput Latest Tweet :టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ఇటీవల 'మంగళవారం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. దీంతో పాయల్ క్రేజ్ కూడా ఇంతకింత పెరిగింది. ఈ చిత్రంలో తన నటనను చూసిన అభిమానులు తన అప్‌కమింగ్ మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ తార సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ రాసుకొచ్చింది. అందులో తనను ఓ సినిమా ఆడిషన్స్‌కు పిలవమని ఆమె కోరింది.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి రూపొందిస్తున్న 'కాంతార' ప్రీక్వెల్ కోసం మూవీ టీమ్ తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటనను వెలువరించింది. అందులో భాగంగా ఈ ప్రీక్వెల్‌లో నటించేందుకు నటులు కావాలంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో మంది కామెంట్ల రూపంలో తమ ఆసక్తిని కనబరిచారు. అయితే నటి పాయల్ కూడా ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. "ఈ అత్యద్భుతమైన చిత్రంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నన్ను ఆడిషన్ కోసం పరిగణలోకి తీసుకోండి. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించిన అభిమానులకు నా ధన్యవాదాలు".అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానులు సైతం తనను ఈ సినిమాలో తీసుకోవాలంటూ హొంబాలే నిర్మాణ సంస్థకు మెసేజ్‌లు పెడుతున్నారు.