Pawan Kalyan Story Writer: ఇప్పుడున్న హీరోలు కేవలం నటనకు మాత్రమే పరిమితం కావడం లేదు. మిగిలిన విభాగాల్లోనూ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగుపెడితే.. మరికొందరు సొంతంగా కథలు రాసుకుంటున్నారు. అయితే ఈ ఆచరణ ఇప్పుడేం కొత్తగా పుట్టుక రాలేదు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోలు నటనతో పాటుగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టేవారు. అంతేకాకుండా స్వయంగా కథలు కూడా రాసుకునేవారు.
మరోసారి రచయితగా మారిన పవన్ కల్యాణ్? - రచయితగా మారిన పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఆయన హీరోగానే కాకుండా తన చిత్రాలకు కథలను కూడా రాసుకున్నారు. ఈ నేపథ్యంతో తన కొత్త చిత్రం కోసం ఆయన మరోసారి రచయితగా మారుతున్నారని సమాచారం.
తాజాగా పవన్ కల్యాణ్ కూడా తన సినిమాకు తానే కథను రాసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత పవన్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా 'గబ్బర్‌సింగ్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్' తెరకెక్కాల్సి ఉంది.
మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా పవన్, హరీశ్ శంకర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారట. అయితే ముందుగా అనుకున్న కథ కాకుండా కొత్త కథతో సినిమా తెరకెక్కించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు పవన్ కల్యాణ్ స్వయంగా కథను అందించనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక పవన్ గతంలో 'జానీ', 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాలకు రచయితగా పనిచేశారు.