Hari Hara Veera Mallu Shooting: కీలకమైన సన్నివేశాల చిత్రీకరణతో శరవేగంగా సాగుతోంది 'హరి హర వీర మల్లు'. ఒక పక్క రాజకీయ పర్యటనల్ని కొనసాగిస్తూనే, మరోపక్క ఈ సినిమాని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు పవన్‌కల్యాణ్. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. శుక్రవారం పవన్‌కల్యాణ్, ఇతర తారాగణంపై ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌కి ముందు ప్రత్యేకంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా పాల్గొన్నారు పవన్‌కల్యాణ్. వేసవికి విడుదల చేయడమే లక్ష్యంగా చిత్రీకరణ కొనసాగుతోంది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఆయన ఔరంగజేబు పాత్రలో నటిస్తారని, వచ్చే నెలలో చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.