అభిమాన కథానాయకుడి నుంచి ఓ కొత్త కబురు అందిందంటే చాలు.. సినీ ప్రియుల ఆనందం ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఎన్నాళ్ల సమయమున్నా.. ముందు నుంచే ఆరాలు మొదలైపోతాయి. చేయబోయే కథేంటి? ఏ జానర్‌లో సాగుతుంది? తమ హీరో ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? జోడీగా కనిపించే ఆ అందాల నాయికెవరు? ఢీ కొట్టబోయే ప్రతి నాయకుడెవరు? ఇలా ఎన్నెన్ని చర్చలో. సినిమా పట్టాలెక్కడానికి ముందే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తాయి. అయితే ప్రకటనలతో ఊరించిన ప్రాజెక్ట్‌లన్నీ.. పక్కాగా అనుకున్న సమయానికే సెట్స్‌పైకి వెళ్తాయన్న రూలేం లేదు. కొన్నిసార్లు లైనప్‌లో మార్పుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చు. ఏదేమైనా సరే.. మళ్లీ ఆ ప్రాజెక్ట్‌పై ఏదోక ప్రకటన వచ్చే వరకు సినీప్రియుల్ని సందిగ్ధత వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి సందిగ్ధతే ప్రస్తుతం పలువురు హీరోల సినిమాల విషయంలో కనిపిస్తోంది.
రీఎంట్రీలో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు సినిమా చిత్రీకరణలకు సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. వీటిలో 'హరి హర వీరమల్లు' ఇప్పటికే సెట్స్‌పై ముస్తాబవుతోంది. హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్', సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మరో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. తాజాగా ఈ జాబితాలోకి సముద్రఖని 'వినోదాయ సిద్ధం' రీమేక్ చేరింది.
తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం 'హరి హర వీరమల్లు' పూర్తి కాగానే హరీష్ శంకర్ సినిమా.. అది పూర్తి కాగానే సురేందర్ రెడ్డి చిత్రం పట్టాలెక్కాల్సి ఉంది. కొవిడ్ పరిస్థితుల వల్ల ఈ లైనప్ మారిపోయింది. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ అనూహ్యంగా 'భీమ్లా నాయక్' కోసం రంగంలోకి దిగడంతో 'వీరమల్లు..' ఆలస్యమైంది. ఆ ప్రభావం హరీష్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌లపై పడింది. ఇప్పుడీ లైనప్‌లోకి 'వినోదాయ సిద్ధం' రీమేక్ వచ్చి చేరడంతో హరీష్, సురేందర్‌ల చిత్రాలు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ 'వీరమల్లు' పూర్తి చేసి.. సముద్రఖని చిత్రం కోసం రంగంలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారం వినిపిస్తోంది. దసరా తర్వాత నుంచి రాజకీయాలకు సమయం కేటాయించేందుకు సమాయత్తమవుతున్నారనీ తెలిసింది. దీనిపై జనసేనాధినేత నుంచి ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఈ నేపథ్యంలో పవన్ చేతిలో ఉన్న మిగిలిన చిత్రాలు ఎప్పటికి పూర్తవుతాయన్నది ఆసక్తిరేకెత్తిస్తోంది.