Paruchuri Venkateswarao: గత కొద్ది రోజులుగా రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన సోదరుడు గోపాలకృష్ణ స్పందించారు. అన్నయ్య ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన మేధస్సు అలాగే ఉందన్నారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆయన.. వెంకటేశ్వరరావు చేసిన పలు సినిమాలకు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు.
'అన్నయ్య ఆరోగ్యంగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాక కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అన్నారు. ఒక్క అభిమాని మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని అద్భుతంగా చెప్పాడు. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు'