Parineeti Chopra Raghav Chadha Wedding : ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకలు ఆదివారం ఉదయం ఉదయ్పుర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరుడిగా ముస్తాబైన రాఘవ్ చద్దా మధ్యాహ్నం 2 గంటల సమయంలో వధువు వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలస్ నుంచి తాజ్ లేక్ ప్యాలస్ వరకు బంధుమిత్రులతో 18 పడవలలో వెళ్లారు. అనంతంరం లీలా ప్యాలెస్‌కు చేరుకున్న రాఘవ్, అతిథులకు.. పరిణీతి చోప్రా కుటుంబం శీతల పానియాలు, డ్రైఫ్రూట్స్, స్వీట్స్ ఇచ్చి ఘనంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో లీలా ప్యాలెస్‌లోని పెళ్లి మండపంలో వేద మంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పరిణీతి-రాఘవ్ ఒక్కటయ్యారు.
ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకలకు ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిథ్య ఠాక్రే, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వంటి తదితర క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి వచ్చిన అతిథులకు వివిధ రాష్ట్రాల వంటలు రుచిచూపించారు. ప్రత్యేకంగా రాజస్థాన్, పంజాబ్ వంటలతో సహా ఇటాలియన్, ఫ్రెంచ్ డిషెస్ కూడా వడ్డించారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
వివాహ వేడుకల కోసం శుక్రవారమే ఈ జంట ఉదయ్‌పుర్‌కు వచ్చింది. వీరి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. శనివారం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. హల్దీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి.