తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పాన్‌ ఇండియా ఒత్తిడిలో ఆ చిత్ర పరిశ్రమలు! - పాన్ ఇండియా సినిమా ఒత్తిడి

Panindia movies effects: భారత చిత్రసీమలో ఇప్పుడు 'పాన్​ ఇండియా' ట్రెండ్​ నడుస్తోంది. ప్రాంతీయ చిత్రపరిశ్రమలు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా భారీ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నాయి. అయితే ఇది మంచి విషయమే అయినప్పటికీ.. కొన్ని రీజినల్​ పరిశ్రమలు మాత్రం 'పాన్​ ఇండియా' సినిమా విషయంలో ఒత్తిడికి గురవుతున్నాయి. అందుకు కారణాలేంటంటే...

pan india movie
పాన్‌ ఇండియా సినిమా

By

Published : Apr 27, 2022, 6:49 AM IST

Updated : Apr 27, 2022, 7:08 AM IST

Panindia movies effects: పాన్‌ ఇండియా సినిమా... - 'బాహుబలి' నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఈ మధ్య అయితే ఆ ప్రస్తావన లేనిదే సినిమా ముచ్చట పూర్తి కావడం లేదు. దేశంలో ఏ మూలన రూపుదిద్దుకున్నా... భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని చేరుకోవడమే ఈ సినిమాల లక్ష్యం. మార్కెట్‌, సాంకేతికత అందుకు కావాల్సినంత బలాన్నిస్తున్నాయి. దాంతో కొన్ని విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. సినీ రూపకర్తలకి ఇది ఉత్సాహాన్నిచ్చే విషయమే అయినా... కొన్ని చిత్ర పరిశ్రమలు వాటి ప్రభావంతో ఒత్తిడికి గురవుతున్నాయి. కథలు, నిర్మాణ శైలి, మార్కెట్‌ వ్యూహాల తక్షణ మార్పే కర్తవ్యం.. అనేంతగా ప్రభావితం అవుతున్నాయి.

అల్లు అర్జున్‌ 'తగ్గేదేలే...' అంటూ తెలుగులో డైలాగ్‌ చెబితే దాని రీ సౌండ్‌ అన్ని భాషల నుంచీ అంతే బలంగా వినిపించింది. క్రికెట్‌ మైదానం మొదలుకొని... చట్ట సభల వరకు ఎన్నో చోట్ల ఎంతోమంది నోట ఆ డైలాగ్‌ వినిపించింది. అదీ పాన్‌ ఇండియా సినిమా ప్రభావం అంటే! ఇదే తరహాలోనే మన పాన్‌ ఇండియా సినిమాలు దేశంలో కీలకమైన సినీ పరిశ్రమలన్నిటిపైనా ఒకొక్క చోట ఒక్కో రకమైన ప్రభావం చూపించాయి. దాంతో ఇప్పుడు ఆయా పరిశ్రమలు కొత్త వ్యూహాలతో అడుగులు వేసే పనిలో ఉన్నాయి.

ఆలోచనలో బాలీవుడ్‌..హిందీ చిత్రాలు దేశం మొత్తం మార్కెట్‌ అవుతుంటాయి. ఆ రకంగా చూస్తే పాన్‌ ఇండియా సినిమాల నిర్మాణం వాళ్లకి అలవాటే. వాళ్ల బడ్జెట్లూ ఎక్కువే. ఓ మోస్తరు స్టార్‌ సినిమా అయినా సరే, భారీ బడ్జెట్‌తో... ఉన్నతమైన సాంకేతిక హంగులతోనే రూపొందుతుంది. ఆ స్థాయిలో తీయడానికి ఇదివరకు ప్రాంతీయ పరిశ్రమల్లో సాధ్యమయ్యేది కాదు. ‘బాహుబలి’ తర్వాత మార్కెట్‌ ముఖచిత్రం మారింది. తగిన కథ, దీటైన నిర్మాణం, పక్కా మార్కెట్‌ వ్యూహం ఉంటే మనమూ భారీ సినిమాలు తీసి విజయాల్ని అందుకోవచ్చని ‘బాహుబలి’తో చాటి చెప్పారు రాజమౌళి. అప్పట్నుంచి దక్షిణాది సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటడం మొదలైంది. ఇటీవలైతే దక్షిణాది నుంచి వెళుతున్న చిత్రాలు ముందు హిందీ సినిమాలు తేలిపోతుండడం బాలీవుడ్‌ని తీవ్రంగా కలవరపెడుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కె.జి.ఎఫ్‌2’ చిత్రాలకి తొలివారం వచ్చినన్ని వసూళ్లు, హిందీ స్టార్ల ప్రాజెక్టులూ పూర్తిస్థాయిలో సాధించలేకపోయాయి. వాళ్ల చిత్రాలు రూ.100 కోట్లకు చేరడం గగనమైపోయింది. దాంతో హిందీలో తెరకెక్కుతున్న కథలపైనా చర్చ మొదలైంది. పటిష్టమైన కథలతో తీయకపోవడంతోనే హిందీ ప్రేక్షకులు దక్షిణాది నుంచి వస్తున్న చిత్రాలపై మొగ్గు చూపుతున్నారని ట్రేడ్‌ వర్గాలు తేల్చాయి. ఇదే విషయంపై ఇటీవల ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహర్‌ అసృంతప్తి వ్యక్తం చేశారు. ఓటీటీ మార్కెట్‌ పుణ్యమాని ఎలాంటి సినిమా తీసినా పెట్టుబడికి ఢోకా ఉండటం లేదని, అందుకే బాలీవుడ్‌ రూపకర్తలు రచన, నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపించడం మొదలు పెట్టాయి. ఈ విమర్శల నుంచి బయట పడాలంటే బాక్సాఫీసుని ఊపేసే సినిమాలు బాలీవుడ్‌లో రావాల్సిందే.

వ్యూహాలు మార్చాలని..దక్షిణాది నుంచి దేశవ్యాప్తంగా విడుదలయ్యే సత్తా ఉన్న చిత్రం అనగానే గుర్తుకొచ్చే దర్శకుల్లో శంకర్‌ ఒకరు. అత్యున్నత సాంకేతిక హంగులతో తీస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చారు. ఒక రకంగా నేటితరంలో దక్షిణాదికి పాన్‌ ఇండియా మార్కెట్‌కి మార్గాన్ని చూపించిందే ఆయనేనని చెబుతుంటారు విశ్లేషకులు. 'రోబో', '2.0' చిత్రాలతో ఆయన అంతర్జాతీయ ప్రమాణాల్ని ప్రదర్శించారు. అంత ఘనమైన చరిత్రే ఉన్న తమిళ చిత్రసీమ నుంచి ఇటీవలి కాలంలో దీటైన సినిమా రావడం లేదు. పక్కనే ఉన్న తెలుగు, కన్నడ నుంచి ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ వంటి సంచలనాత్మక చిత్రాలు రూపుదిద్దుకోవడంతో తమిళ చిత్రసీమలోనూ చర్చ మొదలైంది. అగ్ర తారలతో రొటీన్‌ కథలు చేయడం కంటే... తెలుగు, కన్నడ పరిశ్రమల తరహాలో పాన్‌ ఇండియా ప్రయత్నాలు చేయాలనే డిమాండ్లు అక్కడ ఊపందుకున్నాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ... "ఆ చిత్రాలు బాక్స్‌ఫీసు ముందు విజయం సాధిస్తున్నాయని ఆందోళన చెందాల్సిన పనిలేదు. మనమూ ఆ దిశగా అడుగులేయాలి. ఇక్కడా ప్రతిభావంతమైన యువత ఉంది" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మణిరత్నం పాన్‌ ఇండియా స్థాయిలో ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ తీస్తున్నారు. భారీ ప్రాజెక్టులు చూసి ఆస్వాదించిన ప్రేక్షకులకు అందుకు తగ్గ సినిమాల్నే అందించాల్సిన పరిస్థితులు తలెత్తడంతో తమిళ చిత్రసీమ అందుకు తగ్గట్టుగా కొత్త వ్యూహాల్ని రచించుకునే పనిలో ఉంది.

ఆ స్థాయి కథలే అంటే ఎలా?..ఈ తరహా చిత్రాల నిర్మాణంలో ముందంజలో ఉన్న తెలుగు పరిశ్రమా ఆ విషయంలో ఓ కొత్త రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కథల విషయంలో! మొన్నటిదాకా తెలుగులో ప్రభాస్‌ ఒక్కరే పాన్‌ ఇండియా స్టార్‌. ‘పుష్ప’తో అల్లు అర్జున్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ఆ స్థాయిలో సత్తా చాటారు. ఇకపై వీళ్లు చేసే సినిమాలన్నీ ఆ మార్కెట్‌ లక్ష్యంగానే రూపొందాల్సిందే. మరి అంతమంది హీరోలకి పాన్‌ ఇండియా స్థాయి కథలు దొరకడం సాధ్యమేనా? ప్రతీసారీ ఆ స్థాయి చిత్రాలు చేయగలరా? అంటే కష్టమైన విషయమే అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. "దేశవ్యాప్తంగా అందరినీ మెప్పించే కథ కుదరడం అంత సులభమేమీ కాదు. మేం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం" అని చెబుతారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌."మన సినిమా ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎంతమందైనా చూడొచ్చు. వీలైనంత ఎక్కువమంది చూడాలనే కథలు రాస్తాం. పాన్‌ ఇండియా అనే మాటే నాకెందుకో ఆరోగ్యకరంగా అనిపించదు. అలా కొలతలేసుకుని కథలు రాసుకోవడం కూడా అపాయకరం" అంటారు దర్శకుడు కొరటాల శివ. అయినా ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా తీయడమే ఇప్పుడు అసలు సిసలు సవాల్‌. ప్రస్తుతం అల్లు అర్జున్‌-సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న ‘పుష్ప2’, రాజమౌళి-మహేష్‌బాబు, ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ల చిత్రాలు మరోసారి దేశవ్యాప్తంగా తమ జెండాలు ఎగురవేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి: రాఖీభాయ్​ రాజసం.. రూ.కోట్ల విలువైన కార్లు.. అదిరిపోయే ఇల్లు​

Last Updated : Apr 27, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details