పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కె'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ 'ఫ్రమ్ స్క్రాచ్' అంటూ ఎపిసోడ్ 2 పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. రైడర్స్ మేకింగ్ వీడియో అది. ఇందులో రైడర్స్‌కు కాస్ట్యూమ్స్ ఎలా తీర్చిదిద్దారో వివరించారు.
ఇక ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ డిస్కషన్ జరుగుతూ కనిపించింది. ఆ రైడర్స్ గురించి మూవీటీమ్లో మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు రైడ్ఫర్స్ విలన్స్ అయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రభాస్ తరఫున ఉండే సైన్యం అని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ సినిమాలో ఈ రైడర్స్ అనే వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మరి 'ప్రాజెక్ట్ కె'లో ఈ రైడర్స్ పాత్రేంటి? వారు ఏం చేస్తారు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి ఉండాల్సిందే.
మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్..
అయితే ఈ చిత్రంలో ఇటీవలే కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమా మొదట ప్రకటించినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా మిక్కీ జె మేయర్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్ నారాయణన్‌ను తీసుకోవాల్సి వచ్చింది . ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
"ప్రాజెక్ట్-కె సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ అయినప్పటికీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పటివరకూ ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తైంది. ప్రభాస్‌తో పాటు, దీపిక, అమితాబ్‌లకు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురూ కలిసి కనిపిస్తారు. ఆడియెన్స్ ఇప్పటివరకు చెందని సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఓ ఐదారు కంపెనీలు చేస్తున్నాయి. వాటిని తెరపై చూసినప్పుడు న భూతో నభవిష్యతి అన్నట్లు ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.
వరుసగా తమిళ చిత్రాలకు పని చేస్తున్న సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన ఇప్పటివరకు అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఆయన తెలుగులో నాని 'దసరా', వెంకటేశ్ 'సైంధవ్'కు మ్యూజిక్‌ను అందించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ప్రాజెక్ట్ కె' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఇటీవల సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.