Oscars 2023: ప్రపంచ చలన చిత్రరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును మన తెలుగు పాట.. నాటునాటు సొంతం చేసుకుంది. భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన ఈ క్షణం సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించింది. ఈ నేపథ్యంలో గతంలో ఏయే భారతీయ చిత్రాలు ఏయే విభాగాల్లో ఆస్కార్‌లను వశం చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..
భారత తొలి ఆస్కార్ విజేతగా భాను అథైయా చరిత్ర పుటల్లో నిలిచారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె ఆ పురస్కారం స్వీకరించారు. 1982లో విడుదలైన 'గాంధీ' సినిమాకి గానూ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆ ప్రతిష్టాత్మక అవార్డును ఆమె అందుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆంగ్ల చిత్రమది. దర్శకుడు సహా ఎక్కువమంది ఇంగ్లాండ్ వారు ఈ సినిమాకి పని చేశారు. భానుతోపాటు కొందరు భారతీయులు ఆ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ మొల్లో, భాను అథైయా సంయుక్తంగా గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్లుగా వ్యవహరించి ఆస్కార్ పొందారు.
భారత చలనచిత్ర జగత్తు దశను, దిశను మార్చిన దర్శక దిగ్గజం సత్యజిత్ రే. 'పథేర్ పాంచాలి', 'అపరాజితో', 'పరశ్ పాథర్', 'కాంచన్‌జంగా', 'చారులత'సహా 36 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. స్కీన్ర్ ప్లే రచయిత, కథారచయిత, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చిత్రకారుడు, కళా దర్శకుడు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఆయన నిష్ణాతులు. సినీ రంగానికి సత్యజిత్ రే చేసిన విశేష సేవలను గుర్తించిన 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' 1992లో ఆయనకు గౌరవ పురస్కారంను ప్రకటించింది. అనారోగ్య కారణంగా వేడుకల్లో పాల్గొనలేకపోయిన సత్యజిత్‌రేకు ఆయన చికిత్స పొందిన కోల్‌కతాలోని ఆస్పత్రిలోనే ఆస్కార్‌ను అకాడమీ అందించింది. ఈ గౌరవ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఆయనే.