ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. యావత్ సినీ ప్రపంచమే ఎదురు చూసే ఈ వేడుకల కోసం యూఎస్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ సిద్ధమయ్యింది. ఈ అవార్డును ముద్దాడేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో సినిమాలు వివిధ కేటగిరీలో పోటీ పడుతుంటాయి. అయితే విజయం మాత్రం ఒక్కరినే వరిస్తుంది. ఏటా జరిగే ఈ సంబరాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నప్పటికీ ఈ సారి మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే ఇప్పుడు ఆ రేసులో మన తెలుగు సినిమా పోటీ పడుతోంది. దీంతో ఈ అవార్డులపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే ఈ అవార్డు వేడుకకు హాజరయ్యేందుకు ఎందరో ప్రముఖులు అమెరికాకు విచ్చేశారు. అందులో ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఒకటి. అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఈ అవార్డు ఫంక్షన్ మార్చి 12 ఉదయం 8 గంటలకు మొదలు కానుంది.. భారత్ కాలమానం ప్రకారం సోమవారం.. అంటే 13వ తేదీ ఉదయం 5.30 గంటలకు మనం లైవ్‌లో చూడొచ్చు.
హోస్టులు వీరే..
ఈ అవార్డుల వేడుకను అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కెమెల్ రెడీగా ఉన్నారు. అయితే గత ఏడాది వాండా సైక్స్, రెజీనా హాల్, అమీ షుమెర్లు హోస్టులుగా వ్యవహరించారు.
ఎక్కడ చూడొచ్చంటే..
హులు లైవ్ టీవీ, యూట్యూబ్టీవీ, ఏటీ అండ్ టీ టీవీ , ఫుబో టీవీ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ వేడుకను వీక్షించవచ్చు. అయితే కొన్ని ఛానళ్లు ఉచితంగా ట్రయల్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఏబీసీ.కామ్ లేకుంటే ఏబీసీ మొబైల్ యాప్‌లో కూడా దీన్ని వీక్షించవచ్చు.