సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో జరగనున్న ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆస్కార్ అవార్డుల కమిటీ పూర్తి చేస్తోంది. ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్న సినిమాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు లాస్ ఏంజిల్స్ చేరుకుంటున్నారు. అయితే ఈసారి తెలుగు సినిమా ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు నామినేషన్స్‌లో ఉండటం వల్ల ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాటను గాయకులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు ఆస్కార్ అవార్డుల వేదికపై ఆలపించనున్నారు. అయితే, ఈ పాటకు అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం లేదు. రెండున్నర నిమిషాల పాటు సాగే ఈ ప్రదర్శనలో అమెరికన్ డ్యాన్సర్లు కాలు కదపనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు.
చరణ్, ఎన్టీఆర్ లేకుండా ఆస్కార్‌లో నాటు నాటు.. డ్యాన్స్ చేసేది ఎవరంటే? - RRR Naatu Naatu Oscar Live Performance
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికగా తెలుగు గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు లేకుండానే ఈ పాట డ్యాన్స్ ప్రదర్శన సాగనుంది. ఇంతకీ డ్యాన్స్ ఎవరు చేయనున్నారంటే?
ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ ఓ సాంగ్ షూట్ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన లాస్ ఏంజిల్స్ వెళ్తారు. అలాగే కాల భైరవ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. వీరిద్దరి ప్రదర్శన గురించి ఇప్పటికే అధికారికంగా ఆస్కార్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు.
అవార్డుల వేడుకలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నాటు నాటు హుక్ స్టెప్ వేస్తే చూడాలని యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు అవార్డు వస్తే మాత్రం సరదాగా ఆర్‌ఆర్ఆర్ టీమ్ నాటు నాటుకు హుక్ స్టెప్ వేస్తారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్ స్వయంగా చెప్పారు. ఇప్పటికే ఆర్‌ఆర్ఆర్ పలు అమెరికన్ అవార్డులను దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్, అమెరికన్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12న(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం) జరగనుంది.