Oscar Ban 10Years Will Smith: తన కోపమే తనకు శత్రువని పెద్దలు ఊరికే అనలేదు. వ్యాఖ్యాత మాటలకు సంయమనాన్ని కోల్పోయి చెంపదెబ్బ కొట్టిన విల్ స్మిత్ పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హాస్యనటుడు క్రిస్ రాక్‌పై నటుడు విల్‌స్మిత్ చేయి చేసుకున్న ఘటన వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. తను చేసిన దానికి బాధపడుతూ కార్యక్రమ నిర్వాహకులకు స్మిత్ క్షమాపణలు చెప్పినా ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ అతడిపై పదేళ్ల నిషేధం విధించింది. ఆస్కార్‌తో పాటు ఏ ఇతర అకాడమీ అవార్డ్స్‌లోనూ అతడు పాల్గొనకూడదని శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆస్కార్ చరిత్రలో స్మిత్‌లా ఎవరైనా ఇలా నిషేధానికి గురయ్యారా? అన్న చర్చ ప్రస్తుతం మొదలయ్యింది. ఇలాంటి వాళ్లెవరో? ఆ వివరాల్లేంటో? ఒకసారి చూద్దాం.
మొదటి వ్యక్తి... కార్మిన్ కారిడి..ఆస్కార్ నిషేధానికి గురైన మొదటి వ్యక్తి ఇతడే. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీలో ఉన్న కార్మినే 2014లో తాను జడ్జ్ చేయాల్సిన సినిమాను పైరసీ చేసి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు అందజేశాడు. అది నెట్లో వైరల్ అవడంతో అకాడమీ దీనిపై ఎఫ్‌బీఐ విచారణకు ఆదేశించింది. ఇందులో కార్మినే దోషి అని తేలడంతో అతడిపై నిషేధం వేటు పడింది. గాడ్ ఫాదర్ 2, 3 లాంటి ప్రఖ్యాత చిత్రాలలో నటించిన కార్మిన్ 2019లో మరణించాడు.
అమ్మాయిలను వేధించిన... హార్వే విన్‌స్టన్..ఆస్కార్ అవార్డులకు ఇంత ప్రాచుర్యం రావడానికి కారకులలో ఒకరిగా హార్వేకు పేరుంది. సోదరుడితో కలిసి ‘మిరేమ్యాక్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన హార్వే విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ‘షేక్‌స్పియర్ ఇన్ లవ్’ సినిమాకు ఉత్తమ నిర్మాతగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. 2017లో ఏకంగా 80 మంది మహిళా ఆర్టిస్టులు హార్వే తమను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలే ప్రపంచవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం రావడానికి కారణమయ్యాయి. తన పరపతిని, స్థానాన్ని మోసం చేయడానికి ఉపయోగించుకున్నాడంటూ అకాడమీ ఇతడిపై నిషేధం విధించింది. హార్వే ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
ఆడం కిమ్మెల్..స్మిత్ కన్నా ముందు 2021లో నిషేధానికి గురైంది ఆడమే. ఈయన ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్. మైనర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో అకాడమీ ఇతడి అభ్యర్థిత్వాన్ని నిషేధించింది.