50 ఏళ్ల క్రితం ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేదిక మీద.. ఓ ఆదివాసీ నటికి జరిగిన అవమానానికి అకాడమీ తాజాగా క్షమాపణలు చెప్పింది. నాడు అలా జరిగి ఉండకూడని ఆస్కార్ అకాడమీ క్షమాపణ లేఖలో తెలిపింది. ఓ ఆదివాసీ నటిగా వేదికపై మీరు ఎదుర్కొన్న వేధింపులు.. సమర్థనీయం కాదని అందులో పేర్కొంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 1973 లో ఆస్కార్ అవార్డుల ప్రదనోత్సవం అట్టహాసంగా జరిగింది. పురస్కారాలు పొందిన నటులు.. కరతాల ధ్వనుల మధ్య అవార్డులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో 'గాడ్‌ఫాదర్' చిత్రానికి నటుడు మార్లోన్ బ్రాండోకు ఆస్కార్.. పురస్కారాన్ని ప్రకటించింది. ఆ అవార్డును తీసుకోవడానికి అతడి తరఫున ఆదివాసి నటి సషీన్ లిటిల్ ఫెదర్ వేదికపైకి వచ్చారు. కానీ తీసుకోవడానికి నిరాకరించారు. మార్లోన్ బ్రాండో ఓ సందేశం పంపారని, పురస్కారాన్ని తిరస్కరించారని తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. "మార్లోన్ బ్రాండో తరపున నేను ఇక్కడకు వచ్చాను. ఆయన మీ కోసం ఒక సుదీర్ఘమైన సందేశం పంపారు. కానీ సమయం లేకపోవడం వల్ల అదంతా ఇప్పుడు చదవలేను. ఈ అవార్డును తిరస్కరిస్తున్నందుకు బ్రాండో చింతిస్తున్నారు. అయితే హాలీవుడ్ సినిమాల్లో అమెరికా ఆదివాసీలను చిత్రీకరిస్తున్న తీరుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు" అని ఆమె వేదికపై అన్నారు.