తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హాలీవుడ్ గడ్డపై తెలుగు పాట సంచలనం.. 'నాటునాటు'కు ఆస్కార్ అవార్డు - Oscar 2023 awards

ఆస్కార్‌ వేదికపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని 'నాటునాటు' పాట గెలుపుబావుటా ఎగురవేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ముద్దాడింది. ఆస్కార్‌ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది.

Oscar 2023 RRR movie Naatu Naatu song
ఆస్కార్ 2023 ఆర్​ఆర్ఆర్​ సాంగ్​

By

Published : Mar 13, 2023, 8:27 AM IST

సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్​ పురస్కారాన్ని అందుకుంది తెలుగు చిత్రం RRR. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్​ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. ఈ పాటను చంద్రబోస్​ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్​.ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్​, క్రిటిక్స్ ఛాయిస్​ ఆవార్డులు సాధించింది.

అయితే తాజాగా ఆస్కార్​ గెలుచుకున్న ఈ నాటు నాటు సాంగ్​ ఇప్పటికే.. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్‌ సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రిహాన్నా పాడిన లిఫ్ట్‌ మి అప్‌, టేలర్‌ స్విఫ్ట్‌ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్‌ మై హ్యాండ్‌ పాటలను వెనక్కి నెట్టి.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది.

మరో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు క్రిటిక్స్‌ ఛాయిస్‌ను కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్‌ సాంగ్‌ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా.. ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును 'RRR' అందుకుంది. కరోలినా, సియావో పపా, హోల్డ్‌ మై హ్యాండ్‌ పాటలతో నాటు నాటు పోటీపడింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌-HCA అవార్డును సైతం నాటు నాటు కొల్లగొట్టింది. HCA అవార్డుల్లో బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ స్టంట్స్‌, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్​ఆర్​ఆర్‌ చిత్రం HCA అవార్డులను దక్కించుకుంది. బెస్ట్‌ సాంగ్‌ విభాగంలో హ్యూస్టన్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ సొసైటీ అవార్డును కూడా నాటునాటు కైవసం చేసుకుంది. సియావో పపా, హోల్డ్‌ మై హ్యాండ్‌, స్టాండప్‌ వంటి పాటలతో పోటీ పడి నాటునాటు ఈ ఘనత సాధించింది. వీటితో పాటు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆన్‌లైన్‌ ఫిల్మ్ క్రిటిక్స్‌ సొసైటీ-OFCS అవార్డును సైతం నాటు నాటు పాట తన ఖాతాలో వేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో శాటిలైట్‌ అవార్డుకు నామినేట్‌ అయిన నాటు-నాటు... జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్‌ అసోసియేషన్-GFCA అవార్డుల్లో రన్నరప్‌గా నిలిచింది. సాంగ్‌ ఆన్‌ స్క్రీన్‌ పర్ఫార్మెన్స్‌ విభాగంలో HMMA అవార్డుకు నాటునాటు నామినేట్‌ అయింది.

ఇదీ చూడండి:ఆస్కార్​ వేడుకలో విల్​స్మిత్​ చెంపదెబ్బకు ఏడాది.. ఇప్పటికీ బాధిస్తుందన్న కమెడియన్​

ABOUT THE AUTHOR

...view details