తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Oscars 2023: 95 ఏళ్ల ఆస్కార్​ చరిత్రలో.. రికార్డు స్థాయిలో ఓటింగ్​ - oscar 2023 voting

ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటనకు సంబంధించి లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈనెల 11 నుంచి 17 వరకు నామినేషన్ల కోసం జరిగిన ఓటింగ్‌లో మునుపెన్నడూలేని విధంగా అత్యధిక సంఖ్యలో అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, ఆస్కార్ నామినేషన్ల కోసం భారత్ నుంచి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సహా 10 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై అంచనాలు మరింత పెరిగాయి.

Oscar 2023 record voting
Oscars 2023: 95 ఏళ్ల ఆస్కార్​ చరిత్రలో.. రికార్డు స్థాయిలో ఓటింగ్​

By

Published : Jan 20, 2023, 10:03 AM IST

ఆస్కార్‌ 2023 అవార్డుల ప్రదానోత్సవం కోసం జరిగిన ఓటింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. అయితే, ఈ ఏడాది ఆస్కార్‌ ఓటింగ్‌ మరింత ప్రాధాన్యత సొంతం చేసుకుంది. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా సుమారు 80 దేశాలకు చెందిన అత్యధిక మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన చిత్రాలు, నటీనటులకు ఓటు వేశారు. 95 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్‌ జరగడం ఇదే తొలిసారి అని సమాచారం. ఈ మేరకు అకాడమీ సీఆర్‌ఓ బిల్ క్రామెర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సభ్యులందరికీ సందేశాలు పంపించారని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

ఇక, ఈ సారి అకాడమీ అవార్డుల నామినేషన్స్‌ కోసం మన దేశం తరఫు నుంచి సుమారు 10 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌, ది కశ్మీర్‌ ఫైల్స్‌, కాంతార, విక్రాంత్‌ రోణ, గంగూభాయి కతియావాడి, మి వసంతరావ్‌, తుజ్యా సాథీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్‌ నిళల్‌ వంటి చిత్రాలు ఓపెన్‌ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతోన్న చిత్రాలకు జనవరి 11 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించారు. కాగా, ఓ ఓటింగ్​ ప్రక్రియలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సైతం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 24న ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది.

ఇప్పటికే ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో లాస్ట్‌ ఫిల్మ్‌ షో, ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్​లోని నాటునాటు, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ఆల్‌ దట్‌ బ్రీత్స్‌, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ది ఎలిఫెంట్‌ విష్పెర్స్‌ చోటు దక్కించుకున్నాయి.

ఇదీ చూడండి:వారి వల్లే అలా చేశా.. చాలా ఒత్తిడిగా అనిపించినా మస్తుగా ఉంది ​: బుట్టబొమ్మ హీరోయిన్​

ABOUT THE AUTHOR

...view details